ప్రియుడ్ని ఇంటికి పిలిపించుకుని వెస్ట్రన్ స్టయిల్‌లో ప్రపోజ్ చేస్తానంటూ కుర్చీకి కట్టేసి మరీ తగలబెట్టి చంపేసింది ఓ ప్రియురాలు. ఈ కేసు దేశవ్యాప్తంగా.. అందునా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీసింది. ఈ కేసులో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తనతో వివాహానికి కిరణ్ ఒప్పుకున్నాడని నిందితురాలు ప్రేమ అలియాస్ ప్రేరణ చెబుతోంది.
బెంగళూరులో ప్రియున్ని తన ఇంట్లో కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన కేసులో నిందితురాలు ప్రేమ అలియాస్ ప్రేరణ నెమ్మదిగా నిజాలు బయటపెడుతోంది. కిరణ్‌ను తాను చాలా ప్రేమించేదాన్నని, అయితే అతడు మాత్రం శారీరక అవసరాలు తీర్చే వస్తువుగా తనను భావించేవాడని అంటోంది.
వారం కిందట(21 ఏప్రిల్) బెంగళూరు శివారులోని బైదరహళ్లి పీఎస్ పరిధిలోని అంజనానగర్‌లో ఈ దారుణం జరిగింది. తుమకూరుకు చెందిన కిరణ్.. నగరంలోని ఓ మొబైల్ సర్వీస్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ప్రేమ(ప్రేరణ)తో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచింది. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత.. కుర్చీలో కూర్చోబెట్టి ఫ్యాంట్, షర్ట్ ఊడదీసి కళ్లకు గంతలు కట్టింది. అనంతరం కాళ్లు, చేతులూ కట్టేసింది.
ఆ సమయంలో కిరణ్ కంగారుపడ్డాడు. అయితే.. పాశ్చాత్య దేశాల్లో ఇలాగే చేస్తారని, తానూ అలా వినూత్నంగా ప్రేమను వ్యక్తం చేస్తానని (Love Proposal) నమ్మించింది. ఆ వెంటనే కిరోసిన్ పోసి నిప్పటించి తన మొబైల్‌లో రికార్డు చేసింది. స్థానికులు వచ్చేలోపే హాహాకారాలు చేస్తూ కుర్చీలోనే కిరణ్ సజీవదహనమయ్యాడు. ఘటన జరిగినప్పుడు తాను బాత్‌రూమ్‌లో ఉన్నానని, పొగ రావడంతో గమనించి బయటకు వచ్చేసరికి కిరణ్ కుర్చీలో కాలిపోయి ఉన్నాడని పోలీసులకు చెప్పింది. అయితే, ఆమె తీరుపై అనుమానంతో పోలీసులు గట్టిగా విచారించారు. దీంతో పథకం ప్రకారమే ప్రేమ అతడిని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
నార్త్‌వెస్ట్ డీసీపీ డీఎల్ నగేష్ నేతృత్వంలోని టీం నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారించింది. తొలుత దూరం పెడుతున్నాడనే అతన్ని హత్య చేసిందని అంతా భావించారు. అయితే.. ‘‘కిరణ్‌ను తాను ఎంతో ప్రేమించానని.. కానీ, అతను తనను ఎంతో అవమానించేవాడని ప్రేమ పోలీసుల వద్ద కన్నీళ్లు పెట్టుకుంది. ‘కిరణ్ నన్ను శారీరక అవసరాల కోసం వాడుకుంటున్నాడన్న విషయం నాకు ఆలస్యంగా అర్థమైంది. పెళ్లి చేసుకుందామని అడిగా. ‘నువ్వు కులం తక్కువదానివి.. మా ఇంట్లో ఒప్పుకోరు’ అనేవాడు. ఈ విషయం ప్రేమించినప్పుడు.. కలిసి తిరిగినప్పుడు తెలియదా? అని గట్టిగా నిలదీశా. దీంతో పెద్దల్ని ఒప్పించి ఎలాగోలా వివాహం చేసుకుంటానన్నాడు. అయితే..
పెళ్లి తర్వాత కూడా కేవలం శారీరక అవసరం కోసమే తనతో ఉంటానని చెప్పేవాడు. ఆ మాట నాతోనే కాదు.. అతని స్నేహితుల వద్ద చెబుతూ నన్ను బూతులు తిట్టేవాడు. ఆ విషయం అతని స్నేహితులు రికార్డ్ చేసి పంపారు. నన్ను వాడుకుంటూ నన్నే తిట్టడం, అవమానించడం ఎంతో బాధించింది. భరించలేకపోయా.. అందుకే నిప్పు పెట్టి చంపేశా’’ అని పోలీసుల ముందు ప్రేరణ కన్నీళ్లతో నిజం ఒప్పుకుంది.


