
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో బీరు ప్రియులపై మరో భారం పడనుంది. త్వరలో రాష్ట్రంలో వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది. కొన్నినెలల కింద ప్రభుత్వం మద్యం ధరలను పెంచడం తెలిసిందే. బార్లీ, డీజిల్, పెట్రోల్ రేట్లు అమాంతం పెరగడంతో బీర్ల ధరలు పెంచేందుకు తయారీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం అబ్కారీ శాఖకు ఆ కంపెనీలు విజ్ఞప్తి చేశాయి. బాటిల్ మీద రూ. 5 నుంచి రూ. 10 మేర పెంచడానికి ఉవ్విళ్లూరుతున్నాయి.
ఉక్రెయిన్ యుద్ధం, బార్లీ కొరత
ఈ బీర్ల ధర పెంపునకు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. బీర్ల తయారీలో అవసరమైన ముఖ్యమైన ముడి పదార్థం బార్లీ. బార్లీ ఎక్కువగా రష్యా, ఉక్రెయిన్ నుంచి దిగుమతి అవుతోంది. ప్రస్తుతం ఆ ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా బార్లీ దిగుమతి క్షీణించినట్లు చెబుతున్నారు. దీంతో బీర్ల తయారీకి ఖర్చు పెరిగిందని ధర పెంచుకోవడానికి నిర్ణయించాయి. ఇప్పటికే మద్యం అధిక ధరల వల్ల మందుబాబుల జేబుకు చిల్లు పడుతోంది. ఇప్పుడు బీర్ల ధరలు పెరిగితే లబోదిబోమనడం ఖాయం.
చదవండి: ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు షాక్.. కీలక ఆదేశాలు జారీ