
గౌహతి: బంగ్లాదేశ్‌ను ఈశాన్య రాష్ట్రాలలో కలిపే భారతదేశ చికెన్ నెక్ కారిడార్(Chicken Neck Corridor)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్‌పై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో రెండు ఇరుకైన ‘చికెన్ నెక్’లు ఉన్నాయని, అవి మరింత దుర్భలమైనవని శర్మ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో గల ‘చికెన్స్ నెక్’ గురించి ముహమ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యల దరిమిలా సీఎం శర్మ ఈ విధంగా స్పందించారు.
బంగ్లాదేశ్(Bangladesh)లోని మొదటి ‘చికెన్ నెక్’ దఖిన్ దినాజ్‌పూర్ అని, ఇది నైరుతి గారో హిల్స్ మధ్య 80 కిలోమీటర్ల పొడవైన ఉత్తర బంగ్లాదేశ్ కారిడార్ అని పేర్కొన్నారు. ఈ మార్గంలో ఏదైనా అంతరాయం ఏర్పడితే రంగ్‌పూర్ డివిజన్‌ను బంగ్లాదేశ్ నుండి పూర్తిగా వేరు చేయవచ్చని ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ఎక్స్‌లో తెలిపారు. అలాగే ఈ రహదారిని చూపించే మ్యాప్‌ను ఆయన పంచుకున్నారు. రెండవది దక్షిణ త్రిపుర నుండి బంగాళాఖాతం వరకు ఉన్న 28 కిలోమీటర్ల పొడవైన చిట్టగాంగ్ కారిడార్ అని శర్మ తెలిపారు. భారతదేశానికున్న చికెన్ నెక్ కంటే చిన్నగా ఉన్న ఈ కారిడార్ బంగ్లాదేశ్ ఆర్థిక రాజధాని, రాజకీయ రాజధానికి మధ్య ఉన్న ఏకైక లింక్ అని ఆయన చిట్టగాంగ్ -ఢాకాలను ప్రస్తావిస్తూ పేర్కొన్నారు.
భారతదేశంలోని సిలిగురి కారిడార్ మాదిరిగానే బంగ్లాదేశ్‌లోనూ రెండు ఇరుకైన కారిడార్లు ఉన్నాయని సీఎం అన్నారు. కొంతమంది మరచిపోయిన భౌగోళిక వాస్తవాలను తాను గుర్తుచేస్తున్నానని పేర్కొన్నారు. గత మార్చిలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ అయిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్‌లో చైనా కార్యకలాపాలు విస్తరించడాన్ని ఆహ్వానిస్తూ, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలను ‘సెవెన్ సిస్టర్స్’(Seven Sisters’) అని అంటారని, ఇవి బంగ్లాదేశ్‌తో భూపరివేష్టితంగా ఉన్నాయని, అక్కడి వారికి సముద్ర తీరాన్ని చేరుకోవడానికి ఇతర మార్గాలు లేవని యూనస్ వ్యాఖ్యానించారు. అందుకే మేమే వారికి రక్షకులం అని వ్యాఖ్యానించారు. ఇది బంగ్లాదేశ్‌కు పలు అవకాశాలను అందిస్తుందని, చైనా ఆర్థిక బేస్‌ను విస్తరించడంలో ఇది అనుకూలంగా ఉంటుందని యూనస్ పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన సీఎం శర్మ ఈ ప్రకటనను అభ్యంతరకరమైనదిగా, తీవ్రంగా ఖండించదగినదిగా పేర్కొన్నారు. యూనస్ ప్రకటన దరిమిలా చికెన్స్ నెక్ కారిడార్ కింద, చుట్టూ మరింత బలమైన రైల్వే , రోడ్డు నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేయడం అత్యవసమని పేర్కొన్నారు. అలాగే చికెన్స్ నెక్‌ను దాటేందుకు, ఈశాన్యాన్ని భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించేందుకు ప్రత్యామ్నాయ రహదారి మార్గాలను అన్వేషించాలని సీఎం అన్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్ యూనిస్ చేసిన ప్రకటనలను తేలికగా తీసుకోకూడదని, వారి వ్యూహాత్మక, దీర్ఘకాలిక అజెండాలను ప్రతిబింబిస్తాయని సీఎం శర్మ పేర్కొన్నారు. కాగా బారతదేశంలోని ఈ‘చికెన్ నెక్’ను సిలిగురి కారిడార్ అని కూడా పిలుస్తారు. ఇరుకుగా ఉన్న కారిడార్ కేవలం 20 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. దీని భౌగోళిక ఆకారం కారణంగా దీనిని ‘చికెన్ నెక్’ అని పిలుస్తారు. ఈ మార్గానికి ఉత్తరాన నేపాల్, భూటాన్, దక్షిణాన బంగ్లాదేశ్ ఉన్నాయి.
ఇది కూడా చదవండి: పార్టీ నేతలపై ప్రధాని మోదీ ఆగ్రహం?.. కారణమిదే..