ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం | Another Fire Accident Delhi Tughlakabad area three Died Several Injured | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం

Jun 12 2026 7:09 AM | Updated on Jun 12 2026 9:53 AM

Another Fire Accident Delhi Tughlakabad area three Died Several Injured

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని మరో‍ ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్‌ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించి సహాయక చర్యలు చేపట్టారు.

తుగ్లకాబాద్‌లోని మాధ్యమ్‌ మార్గ్‌, నయా తారా అపార్ట్‌మెంట్‌ సమీపంలోని ఓ ఐదంతస్తుల భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనం లోపల పలువురు చిక్కుకుపోయినట్లు సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.

అర్ధరాత్రి 2.35 గంటల నుంచి 2.37 గంటల మధ్య అగ్నిమాపక శాఖకు ప్రమాదంపై సమాచారం అందింది. మూడు ఫైర్‌ టెండర్లు, రెండు వాటర్‌ బౌజర్లు, శ్వాస సహాయక యూనిట్‌, క్విక్‌ రెస్పాన్స్‌ వాహనాలను రంగంలోకి దించారు. అనంతరం పరిస్థితి తీవ్రత దృష్ట్యా అదనపు అగ్నిమాపక వాహనాలను కూడా పంపించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పాటు భవనంలో చిక్కుకుపోయిన వారిని రక్షించే చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. మరో ఎనిమిది మంది గాయపడిన వారిని ఢిల్లీలోని ఎయిమ్స్‌ ట్రామా సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భవనం లోపల పార్క్‌ చేసిన వాహనాల వద్ద నుంచి మంటలు ప్రారంభమైనట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఉదయం 3.45 గంటల ప్రాంతంలో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురాగా, నాలుగు గంటలకు అగ్నిమాపక చర్యలు ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.

ఇటీవలి కాలంలో ఢిల్లీలో వరుసగా చోటుచేసుకుంటున్న భవన ప్రమాదాలు, అగ్నిప్రమాదాల నేపథ్యంలో భద్రతా ప్రమాణాలపై చర్చ మొదలైంది. గత నెలలో మాలవీయనగర్‌లో మూడు అంతస్తుల వాణిజ్య భవనం కూలిపోవడంతో ఆరుగురు మృతి చెందగా, జూన్‌ 3న హౌజ్‌రాణిలోని ఐదు అంతస్తుల బిల్డింగ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో విదేశీయులతో సహా 23 మంది ప్రాణాలు కోల్పోయారు.  తీవ్ర విమర్శల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో.. 

జూన్‌ 5 నుంచి 10 దాకా 607 ప్రదేశాలను అధికారులు తనిఖీ చేయగా, గురువారం ఒక్కరోజే మరో 47 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. దీంతో మొత్తం తనిఖీ చేసిన ప్రదేశాల సంఖ్య 654కు చేరింది. ఇదే సమయంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ 15 అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు ఆరు భవనాలను సీజ్‌ చేసింది. అలాగే 61 షోకాజ్‌ నోటీసులు, 8 సీలింగ్‌ నోటీసులు, 16 కూల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 1 నుంచి 11 వరకు మొత్తం 179 అక్రమ నిర్మాణాలను కూల్చివేయగా, 206 భవనాలను సీజ్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు. భవన భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు, అగ్నిమాపక నిబంధనల పట్ల నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రత్యేక తనిఖీలు, కఠిన చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement