రాహుల్‌ గాంధీపై మరో పరువు నష్టం కేసు

Another defamation case against Rahul Gandhi - Sakshi

ఆర్‌ఎస్‌ఎస్‌–కౌరవుల వ్యాఖ్యలపై ఉత్తరాఖండ్‌లో కేసు నమోదు

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలతో ఎంపీగా అనర్హత వేటు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి మరో తలనొప్పి మొదలైంది. మహాభారతంలోని కౌరవులను రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌)తో పోలుస్తూ రాహుల్‌ వ్యాఖ్యలు చేశారంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త ఒకరు కేసు వేశారు. గతంలో భారత్‌ జోడో యాత్ర సందర్భంగా రాహుల్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ కోర్టులో కమల్‌ భదౌరియా అనే వ్యక్తి పరువు నష్టం కేసు వేశారు.

ఈ కేసు ఈనెల 12వ తేదీన విచారణకు రానుంది. కమల్‌ న్యాయవాది చెప్పిన ప్రకారం.. ఈ జనవరి తొమ్మిదో తేదీన భారత్‌ జోడో యాత్రలో భాగంగా హరియాణాలోని అంబాలా పట్టణంలోని ఒక కూడలిలో రాహుల్‌ ప్రసంగించారు. ‘ కౌరవులు ఎవరో మీకు తెలుసా ? మొదట మీకు 21 శతాబ్దపు కౌరవుల గురించి వివరిస్తా. వాళ్లంతా ఖాకీ రంగు నిక్కర్లు వేసుకుంటారు. చేతిలో లాఠీ పట్టుకుని ‘శాఖ’లు నిర్వహిస్తారు.

భారత్‌లోని ఇద్దరు, ముగ్గురు అపర కుబేరులు వీరికి మద్దతుగా నిలుస్తున్నారు’ అని రాహుల్‌ ప్రసంగించారని తన పిటిషన్‌లో కమల్‌ పేర్కొన్నారు. ‘21వ శతాబ్దంలో కౌరవులు ఇంకా ఉన్నారు అంటే అది ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులే’ అని ప్రసంగించి ఆర్‌ఎస్‌ఎస్‌ పరువుకు రాహుల్‌ తీవ్ర భంగం కల్గించారని ఆరోపించారు. ‘మోదీ అని ఇంటిపేరు ఉన్నవాళ్లంతా దొంగలే’ అని వ్యాఖ్యానించారన్న కేసులో దోషిగా తేలడంతో సూరత్‌ కోర్టు రాహుల్‌కు ఇప్పటికే రెండేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెల్సిందే. ఎగువ కోర్టులో అప్పీల్‌కు అవకాశం కల్పిస్తూ శిక్ష అమలును తాత్కాలిక నిలుపుదల చేసిన విషయం తెల్సిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top