చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకోబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కే అన్నామలై త్వరలోనే భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం అందుతోంది. అనంతరం త్వరలోనే సొంతంగా ఒక రాజకీయ ఉద్యమాన్ని, ఆ తర్వాత కొత్త పార్టీని స్థాపించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
బీజేపీ నేత అన్నామలైకి అధిష్ఠానంతో అస్సలు పొసగడంలేదు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (2026) ఒంటరిగా పోటీ చేయాలని అన్నామలై భావించినప్పటికీ, బీజేపీ అధిష్టానం మాత్రం తిరిగి AIADMKతో పొత్తు పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఒత్తిడి మేరకు అన్నామలై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయన కనీసం పోటీ కూడా చేయకుండా కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు.
ఈ నేపథ్యంలో పార్టీలో తనకు సరైన గుర్తింపు, భవిష్యత్తు లేవనే అసంతృప్తితో ఉన్న ఆయన ఈ విషయమై బీజేపీ జాతీయ నేత నితిన్ నబిన్‌తో సమావేశం కావడానికి నిన్న( సోమవారం) ఢిల్లీ పయనమయ్యారు. చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను మీడియా ప్రతినిధులు పలకరించగా.. "దయచేసి రెండు రోజులు ఆగండి, మనం కూర్చొని వివరంగా మాట్లాడుకుందాం" అని క్లుప్తంగా సమాధానమిచ్చారు. అయితే, ఆయన విమానాశ్రయానికి వచ్చిన వాహనానికి బీజేపీ జెండా లేకపోవడంతో ఆయమ పార్టీ మారనున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
ప్లాన్ సిద్ధమైందా..?
కాగా జూన్ 4న అన్నామలై పుట్టినరోజు సందర్భంగా చెన్నైలో ఇప్పటికే "మా నాయకుడా, వచ్చి మమ్మల్ని నడిపించు" అనే నినాదాలతో భారీ పోస్టర్లు వెలిశాయి. ఆయన ప్రస్తుతం నడిపిస్తోన్న "వి ది లీడర్స్" అనే స్వచ్ఛంద సంస్థ ఆధారంగా ఒక బలమైన నెట్‌వర్క్‌ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. తొలుత ఉద్యమం చేపట్టి ఆపై దానిని ఒక రాజకీయ పార్టీగా మార్చేలా అన్నామలై వ్యూహం రచిస్తోన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


