బిహార్ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి దుమ్మురేపుతోంది. 180కి పైగా సీట్లలో అధిక్యం సంపాదించి భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ కాషాయ కూటమికి పట్టం కట్టినా ఇంత భారీ స్థాయిలో మెజారిటీ వస్తుందని ఎవరూ చెప్పలేదు. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాత్రం ఎన్డీఏ కూటమి తప్పకుండా 160కి పైగా సీట్లు వస్తాయని, మూడింట రెండో వంతు మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
దేశం యావత్తు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిహార్ ఎన్నికలు ఫలితాలు విడుదలవుతున్నాయి. ఫలితాలలో అధికార ఎన్డీఏ కూటమి హావా స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 180పైగా సీట్లలో కాషాయకూటమి అధిక్యం కనబరుస్తోంది. మహాగఠ్ భందన్ 50 కిపైగా సీట్లలో అధిక్యంలో ఉంది. ఈ ఫలితాలు చూస్తుంటే బిహార్ లో మరోసారి నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం దాదాపుగా ఖాయమైనట్లే. అయితే బిహార్ ఎన్నికల కోసం ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంతగానో శ్రమించింది. కాంగ్రెస్ అగ్రనేత బిహార్ ఎన్నికల ప్రచారాన్ని స్వయంగా తన భూజాలపైన వేసుకొని రాష్టమంతా కలియతిరిగారు. ఎన్నికల కమిషన్ ఓట్లు దొంగలిస్తుందని గతంలో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఇలానే జరిగిందంటూ ప్రచారం చేశారు. ఆర్జేడీ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ సైతం ఇంటికొక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని బిహార్ ని అభివృద్ధి చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చారు. అయినప్పటికీ బిహార్ ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టినట్లు ఫలితాల ట్రెండ్ సూచిస్తుంది.
కాగా కేంద్రం హోం మంత్రి అమిత్ షా మెుదటినుంచి ఎన్డీఏ కూటమికి 160కి పైగా సీట్లు వస్తాయన్నారు. "బిహార్ ప్రజలు ఎన్డీఏతో ఉన్నారు. ఇది పాండవుల యుద్ధం ఐదు పార్టీల సంకీర్ణం( జేడీయూ, బీజేపీ, ఎల్జేపీ, హెచ్ ఏ మ్, ఆర్ఎల్ఎమ్) కలిసికట్టుగా పోరాడుతున్నాం" అని అమిత్ షా ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకట్టుకునే యత్నం చేశారు.


