అప్పుడు మోర్బీ.. ఇప్పుడు గాంభీరా! | Amid Gujarat Gambhira bridge Incident Morbi Comes Spotlight Details | Sakshi
Sakshi News home page

అప్పుడు మోర్బీ.. ఇప్పుడు గాంభీరా!

Jul 9 2025 4:21 PM | Updated on Jul 9 2025 4:42 PM

Amid Gujarat Gambhira bridge Incident Morbi Comes Spotlight Details

గుజరాత్‌లో జరిగిన ఘోర బ్రిడ్జి ప్రమాదం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉన్నట్లుండి బ్రిడ్జి చీలిపోయి కుప్పకూలిపోవడంతో.. ఐదు వాహనాలు మహీసాగర్‌ నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 10 మంది మరణించగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే.. 40 ఏళ్ల కిందట ప్రారంభమైన ఈ వంతెనకు మరమ్మత్తులు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తుండడం విశేషం. 

గుజరాత్‌లోని వడోదర జిల్లాలో ఘోరం జరిగింది. పాడ్రా తాలుకాలో ఆనంద్‌-వడోదర జిల్లాలను కలిపే గాంభీరా వంతెనలో ఓ స్లాబ్‌ బుధవారం ఉదయం విరిగిపడింది. ఈ హఠాత్‌ పరిణామంతో రెండు ట్రక్కులు, రెండు వ్యానులు, ఓ ఆటో కింద ఉన్న మహీసాగర్‌ నదిలో పడిపోయాయి. ప్రమాదం ఉదయం వేళ ట్రాఫిక్‌ రద్దీ ఉన్న సమయంలోనే జరిగింది. 

ప్రమాదంలో ఇప్పటిదాకా 10 మంది మరణించారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. పిల్లర్స్‌ మధ్య భాగం పూర్తిగా కుప్పకూలడంతో వాహనాలు నదిలో పడిపోయాయి. ఘటన సమయంలో ఓ ట్యాంకర్‌ బ్రిడ్జి అంచునకు వచ్చి ఆగిపోయింది.  ఆ ట్యాంకరే అడ్డు లేకుంటే మరికొన్ని వాహనాలు పడిపోయి మరింత నష్టమే జరిగి ఉండేదని అధికారులు అంటున్నారు.  

ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే.. అగ్నిమాపక బృందాలు, స్థానిక పోలీసులు, వడోదర జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వడోదర కలెక్టర్‌ను సంప్రదించి.. గాయపడినవాళ్లకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  రోడ్డు & భవనాల శాఖను ఈ ప్రమాదంపై తక్షణ విచారణ చేపట్టాలని ఆదేశించారాయన. 

ఫైర్ బ్రిగేడ్, బోట్లు, డైవర్స్, NDRF బృందాలు సంఘటనా స్థలంలో సహాయ చర్యలు చేపట్టాయి. క్రేన్ల సహాయంతో వాహనాల్ని వెలికితీసే ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు.. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ₹2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడినవారికి ₹50,000 నష్ట పరిహారాన్ని పీఎంవో ప్రకటించింది. 

గాంభీరా బ్రిడ్జ్.. గుజరాత్-సౌరాష్ట్రను కలిపే కీలక మార్గం. 1985లో దీనిని ప్రారంభించారు. ఇది ఆనంద్, వడోదర, భరూచ్, అంక్లేశ్వర్ మధ్య ప్రయాణించే వారికీ ప్రధాన రూట్ కావడంతో నిత్యం వాహన రద్దీ ఉంటుంది. అయితే చాలా కాలంగా ఈ బ్రిడ్జి పాడైపోయిన స్థితిలో ఉందని, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కనీస స్పందన లేకుండా పోయిందని స్థానికులు అంటున్నారు. అంతేకాదు.. తరచూ ఈ వంతెన సూసైడ్‌ స్పాట్‌గా మారిందని, పోలీసులు కూడా ఇక్కడ నిఘా వహించడం లేదని విమర్శిస్తున్నారు. అయితే.. 

ప్రభుత్వం ఈ విమర్శలను తోసిపుచ్చింది. బ్రిడ్జికి అవసరమైనప్పుడు మరమ్మతులు జరుగుతున్నాయని, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం దర్యాప్తులోనే బయటపడుతుందని గుజరాత్‌ ఆరోగ్య శాఖ మంత్రి రిషికేష్‌ పటేల్‌ అంటున్నారు. తాజా గాంభీరా బ్రిడ్జి ప్రమాద నేపథ్యంలో.. మూడేళ్ల కిందట జరిగిన గుజరాత్‌ మోర్బీ బ్రిడ్జి ప్రమాదం తెర మీదకు వచ్చింది. 

మోర్బీ బ్రిడ్జ్ ప్రమాదం.. భారతదేశంలో అత్యంత ఘోరమైన ఘటనలలో ఒకటి. 2022 అక్టోబర్‌ 30వ తేదీన  మోర్బీ జిల్లా కేంద్రంలో మచ్చు నదిపై ఉన్న జూల్తో పుల్‌ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో 141 మంది మరణించారు.  19వ శతాబ్దంలో నిర్మించిన ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్.. మరమ్మత్తుల తర్వాత అక్టోబర్ 26న తిరిగి ప్రారంభమైంది, అయితే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకుండానే ఈ బ్రిడ్జిని తెరిచినట్టు తేలింది. కేబుల్స్ తుప్పుపట్టినవి, బోల్టులు సడలిపోయినవి, అధిక బరువు ఉన్న ఫ్లోరింగ్ వేశారని ఫోరెన్సిక్ నివేదిక తెలిపింది. ఓరేవా గ్రూప్ అనే ప్రైవేట్ సంస్థ బ్రిడ్జ్ నిర్వహణ బాధ్యత తీసుకుంది, కానీ సరైన అనుమతులు లేకుండానే తెరిచినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. 

 

 ప్రమాదం జరిగిన సమయంలో 500 మందికి పైగా బ్రిడ్జ్‌పై ఉన్నారు, కానీ దాని సామర్థ్యం 125 మంది మాత్రమే. బ్రిడ్జ్ సడెన్‌గా విరిగిపడి, ప్రజలు మచ్చ్ఛు నదిలో పడిపోయారు. మృతుల్లో చాలా మంది పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉన్నారు. ఈ ఘటనపై గుజరాత్‌ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీ వేయించి దర్యాప్తు చేయించింది. ఈ కేసులో ఓరేవా సంస్థ మేనేజర్లు, టికెట్ క్లర్కులు, కాంట్రాక్టర్లు, సెక్యూరిటీ గార్డులు.. మొత్తం 9 మందిని అరెస్ట్‌ చేశారు. ప్రధానమంత్రి మోదీ సంఘటన స్థలాన్ని సందర్శించి, బాధిత కుటుంబాలకు పరామర్శ తెలిపారు కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement