ఇరాన్‌పై అమెరికా యుద్ధం.. భారత్‌లో వీటి ధరలు పెరగనున్నాయా? | After Oil And LPG, Supply Disruption Of This Critical Input May Hit India | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై అమెరికా యుద్ధం.. భారత్‌లో వీటి ధరలు పెరగనున్నాయా?

Apr 13 2026 6:05 PM | Updated on Apr 13 2026 9:24 PM

After Oil And LPG, Supply Disruption Of This Critical Input May Hit India

న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా యుద్ధం కారణంగా రాబోయే రోజుల్లో హర్మూజ్‌ జలసంధిలో చమురు, ఎల్పీజీ సరఫరా అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే భారత్‌లో వినియోగదారులు గ్యాస్‌ కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి త్వరలో సల్ఫర్ దిగుమతులపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. ఫలితంగా సల్ఫర్ ఆధారిత ఉత్పత్తుల తయారీ ఖర్చులు పెరిగి, వాటి ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మోడరన్ వార్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో జరిగే సల్ఫర్ రవాణాలో దాదాపు సగం హర్మూజ్‌ జలసంధి ద్వారానే జరుగుతుంది. సల్ఫర్ అనేది ఎరువుల తయారీ, రసాయన పరిశ్రమలు, లోహ శుద్ధి, బ్యాటరీలు, సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన ప్రధాన ముడి పదార్థం. హర్మూజ్‌ జలసంధి మార్గంలో అంతరాయం కొనసాగితే ఈ కీలక పదార్థం కొరత మరింతగా పెరిగే అవకాశం ఉంది.

ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన ఇరాన్‌పై అమెరికా -ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల ప్రభావంతో 44 వేలకుపైగా కంపెనీల ఉత్పత్తుల రవాణా అంతరాయం ఎదుర్కొన్నట్లు డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్ మరో నివేదికలో పేర్కొంది.

దీని ప్రభావం భారత్‌లోని తయారీ రంగాలపై తీవ్రంగా పడనుంది. ఉత్పత్తి ఖర్చులు పెరగడంతో పాటు వాటి ధరలను కూడా పెంచాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే కరీఫ్ సీజన్ కోసం ఎరువుల సబ్సిడీని 12 శాతం పెంచింది. అయినప్పటికీ యుద్ధం కొనసాగితే ప్రభుత్వ ఆర్థిక భారమూ మరింత పెరుగుతుంది.  చైనా మే నెల నుంచి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎగుమతులను నిలిపివేయనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సరఫరా ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఇప్పటికే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చైనాలో సల్ఫర్ ధరలు 15 శాతం పెరిగాయి.

భారత్‌ మాత్రం ద్వంద్వ సమస్యను ఎదుర్కొంటోంది. రైతులకు ఎరువుల ధరలు పెరగకుండా సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరోవైపు ప్రభుత్వ ఆదాయంపై భారీ ఒత్తిడి పడుతుంది. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ఆహార ధరలు పెరిగి ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి, ఇరాన్–అమెరికా యుద్ధం ప్రభావం కేవలం చమురు, ఎల్పీజీ సరఫరాలకే పరిమితం కాదు. సల్ఫర్ సరఫరా అంతరాయం దేశ ఆహార భద్రత, రైతుల ఖర్చులు, పరిశ్రమల ఉత్పత్తి ఖర్చులపై తీవ్ర ప్రభావం చూపనుందని నివేదికలు స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement