
బిహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ అంశంలో ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం
9వ తేదీలోగా ఆదేశాలు అమలుచేయాలని సూచన
అయితే ఆధార్ అనేది పౌరసత్వానికి రుజువు కాదని వ్యాఖ్య
న్యూఢిల్లీ: బిహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్) అంశంలో ఆధార్ గుర్తింపు కోసం పోరాడుతున్న విపక్ష పార్టీలకు అనుకూలంగా సర్వోన్నత న్యాయస్థానంలో ఉత్తర్వులొచ్చాయి. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో గుర్తింపు కార్డ్‌గా ఆధార్‌నూ పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగీ్చల సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం సూచించింది.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ధృవీకరణ పత్రాల జాబితాలో 12వ గుర్తింపు డాక్యుమెంట్‌గా ఆధార్‌ను పరిగణించాలని ఈసీని న్యాయస్థానం ఆదేశించింది. ‘‘బిహార్ కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటర్ గుర్తింపు విషయంలో ఆధార్‌నూ అనుమతించండి. అయితే ఆ ఆధార్ అనేది పౌరసత్వ గుర్తింపునకు రుజువుగా భావించాలని మేం చెప్పట్లేదు. ఎస్‌ఐఆర్‌లో ఇకపై ఆధార్‌ను సైతం అంగీకరిస్తున్నట్లు స్పష్టంగా పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల అధికారులకు మీరు అవసరమైన ఆదేశాలను జారీచేయండి.
మా ఆదేశాలను సెపె్టంబర్ 9వ తేదీలోపు అమలుచేయండి’’అని ధర్మాసనం ఈసీని ఆదేశించింది. ‘‘అక్రమ వలసదారుల పేర్లు ఓటర్ల జాబితాలో కలపాలని ఎవరూ కోరుకోరు. కేవలం నిజమైన భారతీయ పౌరులను మాత్రమే ఓటు వేసేందుకు అనుమతించాలి. తప్పుడు డాక్యుమెంట్లను సమర్పించిన వారిని గుర్తించి ఓటర్ల జాబితా నుంచి తొలగించాలి’’అని కోర్టు వ్యాఖ్యానించింది. ఓటర్ల ఆధార్ కార్డ్‌ను ఎందుకు ఆమోదించట్లేదో సంజాయిషీ ఇవ్వాలని గతంలో ఆదేశించిన నేపథ్యంలో ఈసీ ఇచ్చిన వివరణను కోర్టు సోమవారం ఆలకించింది.
ఈ సందర్భంగా ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది వాదించారు. ‘‘ముసాయిదా జాబితాలోని 7.24 కోట్ల మంది ఓటర్లలో 99.6 శాతం మంది తమ పేర్లు తుది ఓటర్ల జాబితాలో చేర్చాలంటూ సంబంధిత డాక్యుమెంట్లను ఇప్పటికే సమర్పించారు. ఇక 12వ ధృవీకరణ పత్రంగా ఆధార్‌ను అనుమతించాలంటూ పలువురు పిటిషన్లు ఇచ్చారు. అయితే ఇందులో ఆధార్‌ను ఒక రుజువుగా అంగీకరిస్తామని ఈసీ గతంలోనే పేర్కొంది. అయినాసరే ఆధార్‌ను కచ్చితంగా 12వ ధ్రువీకరణ పత్రంగా చేర్చాలని కోరడంలో అర్థంలేదు’’అని ఆయన వాదించారు. దీంతో ధర్మాసనం జోక్యంచేసుకుంది. ‘‘ప్రజాప్రతినిధుల చట్టం–1950లోని 23(4) సెక్షన్, ఆధార్ చట్టం–2016లోని నియమ,నిబంధనల ప్రకారమే ఓటరు గుర్తింపు కోసం ఆధార్‌ను పరిగణించవచ్చని నిర్ధారించాం. అయితే ఆధార్ అనేది పౌరసత్వాన్ని రుజువుచేయబోదు’’అని ధర్మాసనం స్పష్టంచేసింది.
ఎస్‌ఐఆర్‌పై తగ్గుతున్న నమ్మకం!
‘‘ఎస్‌ఐఆర్ క్రతువుపై పిటిషన్‌దారులు, విపక్షాల్లో నమ్మకం తగ్గుతున్నట్లుగా తోస్తోంది. ఈ నమ్మకాన్ని నిలబెట్టేందుకు రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ రంగంలోకి దిగాలి. రాజకీయ పార్టీలు, ఓటర్లకు పారాలీగల్ వలంటీర్లు సాయపడాలి. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, మార్పులు చేర్పులపై చేసే దరఖాస్తుల విషయంలో వలంటీర్లు సాయం అందించాలి’’అని కోర్టు ఆదేశించింది. తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 30వ తేదీన ముద్రించనున్నారు.
ఈసీ సిగ్గుపడాలి: కాంగ్రెస్
సుప్రీంకోర్టు ఎన్నిసార్లు ఆదేశించినా ఆధార్‌ను ధృవీకరణ జాబితాలో చేర్చకుండా నిర్లక్ష్యవైఖరిని అవలంభిస్తున్న ఈసీ సిగ్గుపడాలని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ సోమవారం తన సామాజికమాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ఓటర్ల నమోదుకోసం ఆధార్‌నూ గుర్తింపు పత్రంగా పరిగణించాలని కోర్టు ఇప్పటికి మూడుసార్లు ఆదేశించింది. అయినా కోర్టు ఆదేశాలను ఈసీ పెడచెవినపెట్టింది. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఈసీ ఈ విషయంలో సిగ్గుపడాలి. విపక్ష రాజకీయ పార్టీలు నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లనూ ఈసీ గుర్తించట్లేదు. ఇవన్నీ ఈసీ సారథి సొంత నిర్ణయాల్లా కనిపిస్తున్నాయి. ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ను, కేంద్ర ఎన్నికల సంఘాన్ని చరిత్ర క్షమించదు’’అని ఆయన అన్నారు.