దాహోద్: పెళ్లి వేడుకను సాధారణంగా స్నేహితులు, కుటుంబం సభ్యులు, బంధువులతో ఎంతో హుషారుగా, రుచికర వంటకాలతో జరుపుకుంటాం. వివాహం అంటే బాగా గుర్తుకువచ్చేది పెళ్లి వంటకాలు కూడా. అదే ఆహారం వందల మంది అనారోగ్యానికి కారణమైతే?
గుజరాత్‌లోని దాహోడ్, అబ్లోడ్ గ్రామంలో బాజా భజంత్రీల మధ్య ఎంతో సందడిగా ఓ పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి సుమారు 300-400 మంది హాజరయ్యారు. వారంతా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, వికారము, కడుపు నొప్పి, డయేరియాతో బాధపడ్డారు. వారిలో 50-60 మందిని స్థానికులు జైడస్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
జైడస్ ఆసుపత్రి ఆర్ఎమ్‌వో డాక్టర్ రాజీవ్ దామోర్ తెలిపిన వివరాల ప్రకారం.. రోగులకు గత రాత్రి 11 గంటల సమయంలో లక్షణాలు మొదలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి ముందుగానే సమాచారం రావడంతో 150-200 మంది రావచ్చని అంచనా వేసి పడకలు, అత్యవసర సేవలు సిద్ధం చేశామని తెలిపారు. సుమారు 50-60 మంది రోగులు చేరారని, చికిత్స పొందుతున్నారని చెప్పారు. అధికారులు అత్యవసర దర్యాప్తు ప్రారంభించి ఆరోగ్య బృందాలను అప్రమత్తంగా ఉంచారు.
పెళ్లి కార్యక్రమానికి వచ్చివారికి ఇలాంటి అనుభవం ఏర్పడడంతో ఆ గ్రామంలోని వారంతా షాక్ అయ్యారు. పెళ్లిలో అందించిన ఆహార నమూనాలను అధికారులు సేకరించి ప్రయోగశాల విశ్లేషణకు పంపించారు. ఆహారం తయారీ, వడ్డించే సమయంలో పాటించిన పరిశుభ్రత ప్రమాణాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) రూపొందించిన ఆహార భద్రత ప‍్రమాణాలు పాటిస్తే ఎటువంటి సమస్యలూ ఉండవు. పరిశుభ్రతను గాలికి వదిలేసి వండితే సమస‍్యలు తప్పవు.
‘దాహోద్‌లో 400 మందికిపైగా పెళ్లి భోజనం తిన్న తర్వాత అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఘటన ఆందోళనకర విషయం. ఈ ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరగాలి. అందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
दाहोद में 400 से ज़्यादा लोगों का शादी का खाना खाकर बीमार पड़ना चिंता का विषय है। इस घटना की निष्पक्ष जांच होनी चाहिए। मैं सभी के जल्द स्वस्थ होने की प्रार्थना करता हूँ।
फ़ूड सेफ़्टी में लापरवाही कभी भी हेल्थ इमरजेंसी का रूप ले सकती है। देश भर में मिलावटी खाद्य सामग्री पकड़ी जा… https://t.co/fpRTSue7vu— Arvind Kejriwal (@ArvindKejriwal) April 21, 2026


