
వడోదర/అహ్మదాబాద్: గుజరాత్‌లోని వడోదర జిల్లాలో బుధవారం ఉదయం వంతెన పాక్షికంగా కుప్పకూలిన ఘటనలో మరణాల సంఖ్య గురువారానికి 17కు పెరిగింది. ఇంకా ఆచూకీలేకుండా పోయిన నలుగురి కోసం మహిసాగర్ నదీప్రవాహం వెంట ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, గజ ఈతగాళ్ల బృందాలు విస్తృతంగా గాలింపు కొనసాగిస్తున్నాయి. ఆనంద్, వడోదర జిల్లాలను కలిపే 40 ఏళ్లనాటి ఏకైక గంభీర్ వంతెన కుప్పకూలడంతో రెండు జిల్లాల మధ్య రాకపోకలు పూర్తిగా తెగిపోయాయి.
‘‘పాద్రా పట్టణ సమీపంలో కూలిన గంభీర–ముజ్‌పూర్ వంతెన వద్ద గాలింపు కొనసాగుతోంది. వర్షాలు, నదీ ప్రవాహం వెంట బురద కారణంగా గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కల్గుతోంది’’ అని వడోదర జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రోహన్ ఆనంద్ చెప్పారు. నదీ ప్రవాహం మధ్యలో పడిపోయిన వాహనాలను లాగేందుకు, గాలింపు చర్యల కోసం తాత్కాలికంగా ప్రత్యేక వంతెనను నిర్మించామని వడోదర జిల్లా కలెక్టర్ అనిల్ ధమేలియా చెప్పారు.
నాలుగేళ్లలో 16 వంతెన ప్రమాదాలు
వంతెన కూలిన ఘటనపై విపక్ష కాంగ్రెస్ స్పందించింది. ‘‘ గత నాలుగేళ్లలో రాష్ట్రంలో 16 వంతెన దుర్ఘటనలు జరిగాయి. ఈ అంశంలో సిట్‌తో దర్యాప్తు చేపట్టాల్సిందే. లేదంటే ఉద్యమం చేస్తాం. ప్రభుత్వపాలన అమోఘంగా ఉందంటూ ప్రసంగాలు, అడ్వరై్టజ్‌మెంట్లు ఇవ్వడంలోనే బీజేపీ నాయకత్వం, ప్రభుత్వ అధికారులు బిజీగా ఉన్నారు’’ అని కాంగ్రెస్ విమర్శించింది. రాష్ట్రంలో నాయకత్వలోపం ఉందని, ఇలాంటి ప్రభుత్వానికి ఓటర్లు సరైన సమయంలో బుద్ధి చెప్తారని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ ఘటనలో వంతెనల తనిఖీలో నిర్లక్ష్యం వహించారంటూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖకు చెందిన నలుగురు ఇంజనీర్లను గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గురువారం సస్పెండ్ చేశారు. రోడ్లు, భవనాల శాఖను ఆయన దగ్గరే ఉంది.