 
													తొలి దశలో 24 చోట్ల తలనొప్పులు
పొత్తులతో సీట్లు గల్లంతు
ఐదేళ్లూ జనంలోనే ఉన్న నేతలు
స్వతంత్రులుగా పోటీ చేస్తున్న వైనం
గతంలో ఒక్కొక్కరికీ 40 వేలపైన మెజారిటీ
తాజాగా విజయావకాశాలను దెబ్బతీసే పరిస్థితి
వనం దుర్గా ప్రసాద్ (బిహార్ నుంచి సాక్షి ప్రతినిధి)
అసంతృప్తుల బుజ్జగింపు బిహార్‌లో ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారింది. తొలి దశ ఎన్నికలు జరిగే 121 స్థానాల్లో 24 చోట్ల ఓట్లను చీల్చగల తిరుగుబాటు అభ్యర్థులున్నారు. ఎన్‌డీయే, ఇండియా కూటములకు వీరు సవాలుగా మారారు. దీంతో, సంకీర్ణ పొత్తుల పోరాటంలో ఓట్ల బదలాయింపు ఏ మేరకు జరుగుతుందనే ఆందోళన పార్టీలను వెంటాడుతూనే ఉంది.
పొత్తుల కారణంగా సీట్లు త్యాగాలు చేయాల్సిన పరిస్థితి అన్ని పార్టీల నేతలకు వచ్చింది. అయితే దీన్ని వారు సానుకూలంగా తీసుకోవడం లేదు. తాము చేస్తున్నది స్నేహ పూర్వక పోటీ మాత్రమేనని కొంతమంది రెబల్స్ చెబుతున్నారు. 2020 ఎన్నికల్లో కేవలం వెయ్యి ఓట్ల తేడాతో 11 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల గెలుపు సాధ్యమైంది. ఈ 11 స్థానాల్లో నూ తిరుగుబాటు అభ్యర్థులు 40 నుంచి 50 వేల ఓట్లు సాధించారు. వీరంతా ప్రధాన పార్టీలు టికెట్ నిరాకరించడంతో పోటీకి దిగిన వారే.
   
సత్తా చూపేందుకేనా?
సంకీర్ణ రాజకీయాలే బిహార్‌లో తిరుగుబాటు అభ్యర్థులకు తెగింపు నిస్తున్నాయనేది పట్నాకు చెందిన రాజకీయ విశ్లేషకుడు జగదీవ్ పూరీ అభిప్రాయం. ఎన్‌డీయేలో బీజేపీ, జేడీయూ, ఎల్‌జేపీ, హెచ్‌ఏఎం, ఆర్‌ఎల్‌ఎస్పీ ఉన్నాయి. ఇండియా కూటమిలో ఆర్‌జేడీ, కాంగ్రెస్, వీఐపీ, వామపక్ష పార్టీలున్నాయి. ఇవి కాకుండా జన్‌సురాజ్, బీఎస్‌పీ, ఏఐఎంఐఎం వంటి పార్టీలూ పోటీ చేస్తున్నాయి. కూటముల మధ్య పొత్తుల కారణంగా సీట్ల సర్ధుబాటు అనివార్యమైంది. 
దీంతో ఐదేళ్లుగా నియోజకవర్గంలో బలాన్ని పెంచుకున్న నేతలకు సీట్లు దక్కలేదు. మౌనంగా ఉండిపోతే రాజకీయ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని భావిస్తున్నారని ఎన్‌డీయే పక్షంలో సీటు రాని మధోల్ తెలిపారు. తమకు ప్రజాబలం ఉన్నప్పటికీ అగ్ర నేతలను ఆర్థికంగా లోబర్చుకున్నారనేది ఆయన ప్రత్యర్థులపై చేసే ఆరోపణ. అధిష్టానం బుజ్జగించినా రెబల్స్ వినేట్టు లేదని పలువురు నేతలు చెబుతున్నారు. బరి నుంచి తప్పుకున్నా, నష్టం చేయడానికి వారు మొగ్గు చూపడం పోటీ చేస్తున్న అభ్యర్థులను కలవర పెడుతోంది. 
  
రెబల్స్ తాకిడి ఉన్న స్థానాలు
→ మాంఝీ స్థానంలో బీజేపీ రెబల్ రాణా ప్రతాప్ డబ్ల్యూ సవాల్‌గా మారారు. జేడీయూ అభ్యర్థి రణధీర్ సింగ్‌ను ఓడించడం లక్ష్యంగా చెబుతున్నారు. సీపీఎం ఎమ్మెల్యే సత్యేంద్ర యాదవ్ కూడా పోటీ చేస్తున్నారు.
→ గరౌలిలో ఆర్జేడీ దిలీప్ సింగ్‌కు టికెట్ ఇచ్చింది. ఆర్జేడీ అభ్యర్థి రేయాజుల్ హక్ రాజు టికెట్ నిరాకరించడంతో తిరుగుబాటు స్వరం విన్పిస్తున్నారు. 
→ సతావ్‌పూర్ కమల్ నుంచి ఎల్‌జేపీ అభ్యర్థి సురేంద్ర వివేక్‌పై జేడీయూ నేత శశికుమార్ అలియాస్ అమర్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆర్జేడీ ఎమ్మెల్యే సంతానంద్ సంబుద్ధ పోటీలో ఉన్నారు.
→ జమాల్‌పూర్‌లో మాజీ మంత్రి శైలేష్ కుమార్ జేడీయూను వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జేడీయూ నచికేత మండల్‌ను నామినేట్ చేసింది. వీఐపీకి చెందిన నరేంద్ర తంతి బరిలో ఉన్నారు.
→ చరివవారియార్‌పూర్‌లో ఆర్జేడీ నేత రామ్‌సఖా మహతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన పార్టీ అభ్యర్థి సుశీల్ కుష్వాహాను ఎదుర్కొంటున్నారు. జేడీయూ అభ్యర్థి అభిషేక్ కుమార్ పోటీ చేస్తున్నారు.
→ జాలే స్థానం నుంచి రిషి మిశ్రా కాంగ్రెస్ అభ్యర్థి. చివరి నిమిషంలో ఆర్జేడీ నుంచి కాంగ్రెస్‌లో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు. 2020లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న మక్సూద్ అహ్మద్ ఉస్మానీ తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మంత్రి, బీజేపీ నాయకుడు జీవేత్ ఇక్కడ పోటీ చేస్తున్నారు.
→ బస్విధలో జేడీయూ ఎమ్మెల్యే సుదర్శన్ కుమార్ పార్టీ టికెట్ నిరాకరించడంతో తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. జేడీయూ డాక్టర్ పుష్పంజయ్ కుమార్‌ను, కాంగ్రెస్ త్రిశుల్ధారి సింగ్‌ను బరిలోకి దించాయి.
→ మహ్నార్‌లో ఆర్జేడీ స్విందర్ సింగ్‌ను బరిలోకి దింపింది. ఆర్జేడీకి చెందిన సంజయ్ రాయ్ రెబల్‌గా మారారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అచ్యుతానంద సింగ్ (కాంగ్రెస్‌ను వీడి) పరాస్‌కు చెందిన ఆర్‌ఎల్‌ఎస్‌పీ నుంచి పోటీ చేస్తున్నారు.
→ ఛప్రా నుంచి బీజేపీ అభ్యర్థి రాఖీ గుప్తా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఛోటీ కుమారికి పెద్ద సవాల్‌గా మారారు. ఆర్జేడీ నుంచి ఖేసరీ లాల్ యాదవ్ పోటీ చేస్తున్నారు.
→ జగదీష్‌పూర్ ఆర్జేడీ ఎమ్మెల్యే రామ్ విష్ణు లోహియా కుమారుడు కిషోర్ కునాల్‌కు టికెట్ ఇచ్చారు. రాజీవ్ రంజన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
→ గోపాల్‌గంజ్‌లో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు అనూప్‌లాల్ శ్రీవాస్తవ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ సుభాష్ సింగ్‌ను 
నిలబెట్టింది. 
→ బచ్వారలో బీజేపీ నేత శత్రుఘ్న కుమార్ ఆ పార్టీ అభ్యర్థి సురేంద్ర మెహతాపై తిరుగుబాటుదారు. అతను ఇప్పుడు పార్టీ ఇబ్బందులను మరింత పెంచుతున్నాడు.
→ సూర్యగఢలో ఎల్జేపీ ఆర్జేడీకి చెందిన అశోక్ సింగ్ అని పిలిచే రవిశంకర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన జేడీయూకి చెందిన రామానంద్ మండల్‌ను ఎదుర్కొంటారు. ఆర్జేడీ నుంచి ప్రేమ్ సాగర్ చౌదరి పోటీ చేస్తున్నారు. 
వనం దుర్గా ప్రసాద్ (బిహార్ నుంచి సాక్షి ప్రతినిధి)

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
