క‌రోనాను జ‌యించిన 105 ఏళ్ల బామ్మ

105 Year Old Kerala Woman Recovers From Coronavirus After 3 Months - Sakshi

కొల్లామ్ : దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోన్న వేళ ఆ మ‌హ‌మ్మారి నుంచి కోలుకుంటున్న వారి  సంఖ్య కూడా గ‌ణ‌నీయంగా పెరుగుతుండ‌డం మాత్రం ఊర‌ట క‌లిగించే అంశమ‌నే చెప్పొచ్చు. వ‌య‌సుమీద ప‌డ్డ‌వారిపై ఈ వైర‌స్ ప్ర‌భావం అధికంగా ఉంటుంది. దేశంలోనూ వైర‌స్ బారిన ప‌డి కోలుకున్న వారిలో వృద్దులు కూడా ఉన్నారు. తాజాగా క‌రోనా వైర‌స్‌తో మూడు నెల‌లపాటు పోరాడిన‌ కేర‌ళ‌కు చెందిన 105 ఏళ్ల బామ్మ బుధ‌వారం సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లారు. ఈ విష‌యాన్ని కేర‌ళ ఆరోగ్య ‌శాఖ స్వ‌యంగా వెల్ల‌డించింది.(పూజారితో పాటు 16 మంది పోలీసులకు కరోనా)

వివ‌రాలు.. కొల్లామ్ జిల్లాలోని ఆంచ‌ల్ ప‌ట్ట‌ణానికి చెందిన 105 ఏళ్ల ఆస్మా బీవీ ఏప్రిల్ 20న క‌రోనా బారిన ప‌డ్డారు. ఆమెకు త‌న కూతురు ద్వారా వైర‌స్ సంక్ర‌మించిన‌ట్లు తెలిసింది. కుటుంబ‌స‌భ్యులు ఆస్మా బీవీని చికిత్స కోసం కొల్లామ్ మెడిక‌ల్ ఆసుప‌త్రిలో చేర్పించారు. అయితే వ‌య‌సు రిత్యా ఆస్మా వైర‌స్ దాటికి త‌ట్టుకుంటుందా అన్న అనుమానం అక్క‌డి వైద్యుల‌కు క‌లిగింది. వారి అనుమానాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ దాదాపు మూడు నెల‌ల పాటు క‌రోనాతో పోరాడి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్లారు. ఆస్మా విజ‌యంతంగా క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డ‌డంతో వైర‌స్ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్న అతి పెద్ద వ‌య‌స్కురాలిగా చ‌రిత్ర సృష్టించిన‌ట్లు వైద్యాధికారులు తెలిపారు. చికిత్స స‌మ‌యంలో కొన్ని ఆరోగ్య స‌మ‌స్య‌లు చ‌ట్టుముట్టినా ఆమె త‌న ఆత్మ‌స్థైర్యం కోల్పోకుండా క‌రోనాతో దైర్యంగా పోరాడింద‌ని వెల్ల‌డించారు. ఆమె ఆరోగ్య స్థితిని ప‌ర్య‌వేక్షించేందుకు ఒక మెడిక‌ల్ బోర్డును కూడా ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు.

ఇప్ప‌టివ‌ర‌కు కేర‌ళ‌కు చెందిన 93ఏళ్ల థామ‌స్ అబ్ర‌హం క‌రోనా నుంచి కోలుకున్న అతిపెద్ద వ‌య‌స్కుడిగా నిలిచారు. కానీ ఇప్పుడు అదే కేర‌ళ‌కు చెందిన ఆస్మా బీవీ వైర‌స్ నుంచి కోలుకొని దేశంలోనే అతిపెద్ద వ‌య‌స్కురాలిగా నిలిచారు. ఈ విష‌యం తెలుసుకున్న కేర‌ళ ఆరోగ్య శాఖ మంత్రి కెకె శైల‌జ క‌రోనాను జ‌యించిన‌ ఆస్మా బీవీని ప్ర‌శంసించారు. త‌న‌కు వైర‌స్ సోకింద‌ని తెలిసినా అంత పెద్ద వ‌య‌సులోనూ త‌న ఆత్మ‌స్థైర్యాన్ని కోల్పోలేదంటూ మెచ్చుకున్నారు. కేర‌ళ‌లో క‌రోనాతో బాధ‌ప‌డుతున్న పెద్ద వ‌య‌స్కుల వారికి చికిత్స అందిస్తున్న డాక్ట‌ర్ల‌కు, న‌ర్సుల‌కు, ఇత‌ర వైద్య సిబ్బందిని శైలజ అభినందించారు. కాగా కేర‌ళ‌లో కొత్త‌గా 903 క‌రోనా కేసులు న‌మోద‌వ్వ‌గా.. మొత్తం కేసుల సంఖ్య 21,797గా ఉంది. కాగా మ‌ర‌ణాల సంఖ్య 68కి చేరింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top