నారాయణపేట: మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా మండలంలోని పేరపళ్లలో చేపడుతున్న భూ సేకరణ వ్యవహారం ఇప్పుడు అనేక ప్రశ్నలకు తావిస్తోంది. జాయమ్మ చెరువు పరిధిలో ముంపునకు గురయ్యే భూముల విస్తీర్ణం, రెవెన్యూ రికార్డుల్లో నమోదైన భూమి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ విస్తీర్ణం మధ్య తేడాలపై రైతుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు భూముల హద్దులు, విస్తీర్ణంపై స్పష్టత కోసం రీ–సర్వే చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో చేపట్టిన సర్వేపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అధికారులు తిరిగి సర్వే నిర్వహించారు.
సర్వేనంబర్ 87, 92, 111లో
అసలు భూమి ఎంత?
జాయమ్మ చెరువు రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న 87, 92, 111 సర్వేనంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమి ఎన్ని ఎకరాలు, అందులో రైతుల వద్ద ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలు, ధరణి/భూ భారతి రికార్డులు, పాత పహాణీలు, సర్వేనంబర్లు, సబ్–డివిజనన్ వివరాల ప్రకారం విస్తీర్ణం.. భూ సేకరణ సర్వేలో గుర్తించిన విస్తీర్ణంలో తేడా ఎందుకు వచ్చిందన్నది తేలాల్సి ఉంది. రైతులకు నష్టం కలగకుండా భూ వివరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి పారదర్శకంగా సర్వే చేయాలని కలెక్టర్ ఓ వైపు అధికారులను ఆదేశిస్తూ వస్తున్నారు. సర్వే ప్రక్రియలో ఒక్క గుంట కూడా తేడా రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు.
పరిహారమే అసలు పంచాయితీ..
ప్రాజెక్టు నిర్మాణంలో భూమి కోల్పోతున్న రైతుకు సరైన పరిహారం అందించేందుకే రీ–సర్వే ప్రాతిపదిన. భూ విస్తీర్ణం పెరిగితే పరిహారం లెక్క మారుతుంది. భూమి తగ్గితే రైతుకు నష్టం. తప్పుడు హద్దులు నమోదైతే వివాదం. ప్రభుత్వ భూమి, పట్టా భూమి గుర్తింపులో పొరపాటు జరిగితే మరింత పెద్ద సమస్య. అందుకే సర్వే రికార్డు నుంచి అవార్డు వరకు ప్రతి దశను బహిరంగంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
దళారుల పాత్రపై నిఘా ఉందా?
భూ సేకరణ సమయంలో రైతులకు అందాల్సిన పరిహారం చుట్టూ మధ్యవర్తులు, పైరవీకారులు రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు ఓ వైపు ససేమిరా అంటున్నా.. మరోవైపు అధికార పార్టీ వత్తిళ్లతో సర్వేలో సర్దేస్తారనే ప్రచారం కొనసాగుతుంది.
పేరపళ్ల జాయమ్మ చెరువు రిజర్వాయర్ ముంపు భూముల పరిహారం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కొంతమంది పేరపళ్ల రైతులను ఓ భవన్‌కు పిలిపించి పట్టాదారు పాసు పుస్తకాలు ఉండి ప్రస్తుతం భూమి లేని రైతులు.. భూమి సాగు చేసుకుంటున్న రైతుల మధ్య పరిహారం విషయంలో సర్దుబాటు చేసుకోవాలని అధికార పార్టీకి చెందిన దూత సూచించినట్లు తెలుస్తోంది. తమ సమస్య పరిష్కారానికి పిలిచారని భావించి వచ్చిన తమకు.. పరిహారం పంచుకునే అంశం తెరపైకి తీసుకురావడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. భూమి హక్కు ఎవరికి ఉందో రికార్డుల ఆధారంగా తేల్చాల్సింది పోయి.. పరిహారం విషయంలో రైతుల మధ్య సర్దుబాటు ఎందుకని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
జాయమ్మ చెరువు రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న గుట్ట ఇదే
పేరపళ్ల జాయమ్మ చెరువు రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న గుట్టంతా సర్వేనంబర్ 92లోనే ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కానీ అదే గుట్టపై కొందరి పేర్లపై పట్టాదారు పాసు పుస్తకాలు.. మరికొందరుకాస్తులో లేకపోవడం పరిహా రం విషయంలో కొత్త ప్రశ్నలకు తెరతీస్తోంది. పట్టాదారు పాసు పుస్తకాలున్నా.. తమకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. అందరికీ న్యా యం చేయాలని.. లేకపోతే రిజర్వాయర్ పనులను అడ్డుకుంటామని కొందరు రైతులు హెచ్చరిస్తుండటంతో పరిహారం పంచాయితీ మొదలైందని చెప్పవచ్చు.
పేరపళ్ల భూ సేకరణపై ఉత్కంఠ
రికార్డులు, క్షేత్రస్థాయి విస్తీర్ణంలో
తేడాలపై అనుమానాలు
రైతుల పరిహారంపై ఒత్తిళ్లు..
మధ్యవర్తుల హడావుడి
అర్హులకే చెల్లిస్తామంటున్న అధికారులు


