కోస్గిలో టీడబ్ల్యూయూ
విజయం..
నారాయణపేట: నారాయణపేట, కోస్గి డిపోల్లో శుక్రవారం టీఎస్‌ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. రాష్ట్ర, రీజియన్‌స్థాయి గుర్తింపు సంఘాల ఎంపికకు నిర్వహించిన ఎన్నికల్లో కార్మికులు పాల్గొని ఓటుహక్కు వినియోగించుకున్నారు. నారాయణపేటలో టీడబ్ల్యూయూ–ఎస్‌డబ్ల్యూఎఫ్ ఐక్య కూటమి, కోస్గిలో టీడబ్ల్యూయూ విజయం సాధించాయి. ఆయా డిపోల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ కార్మిక సంఘాల కూటములు ఎన్నికల బరిలో నిలవడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. పోలింగ్ ముగియడంతో అభ్యర్థులు, కార్మిక సంఘాల నాయకుల్లో ఫలితాలపై సాయంత్రం 7 గంటల వరకు ఉత్కంఠ నెలకొంది. రీజియన్ పరిధిలోని డిపోల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టి సంబంధిత అధికారులకు నివేదించగా.. తుది ఫలితాలను ఈ నెల 17న అధికారికంగా ప్రకటించనున్నారు. విధుల్లో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు.
నారాయణపేట డిపోలో..
నారాయణపేట డిపోలో మొత్తం 285 మంది ఓటర్లకుగాను 283 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 99 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. రాష్ట్రస్థాయి గుర్తింపు కోసం క్లాజ్–3, రీజియన్‌స్థాయి గుర్తింపు కోసం క్లాజ్–6 కింద ఓటింగ్ నిర్వహించారు. క్లాజ్–3లో 194 ఓట్లు, క్లాజ్–6లో 203 ఓట్లు పడ్డాయి. ఎన్నికల్లో టీడబ్ల్యూయూ–ఎస్‌డబ్ల్యూఎఫ్ ఐక్యకూటమికి 203 ఓట్లు సాధించగా.. టీజేఎంయూకు 72 ఓట్లు వచ్చాయి. 131 ఓట్ల ఆధిక్యంతో టీడబ్ల్యూయూ–ఎస్‌డబ్ల్యూఎఫ్ ఐక్యకూటమి విజయం సాధించింది. తెలంగాణ జాతీయ మజ్ధూర్ యూనియన్‌కు క్లాస్–3లో 66 ఓట్లు, క్లాస్–6 లో 72 ఓట్లు వచ్చాయి. అలాగే ఎంప్లాయీస్ యూనియన్‌కు క్లాజ్–3లో 20 ఓట్లు, తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు 4 ఓట్లు, సామాజిక తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు ఒక ఓటు వచ్చింది.
కోస్గి డిపోలో బాణం గుర్తు విజయకేతనం ఎగురవేసింది. టీడబ్ల్యూయూకు 55 ఓట్లు రాగా.. ఎంప్లాయీస్ యూనియన్‌కు 46 ఓట్లు వచ్చాయి. 9 ఓట్ల ఆధిక్యంతో టీడబ్ల్యూయూ విజయకేతనం ఎగువేసింది. మొత్తం 110 మందికిగాను 107 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. బహుజన వర్కర్స్ యూనియన్‌కు క్లాజ్–3లో 1, క్లాజ్–6లో 1 ఓటు, ఉద్యోగుల సంఘానికి క్లాజ్–3లో 43, క్లాజ్–6లో 46 ఓట్లు, కార్మిక సంఘానికి క్లాజ్–3లో 1, క్లాజ్–6లో 1 ఓటు, తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సంఘానికి క్లాజ్–3లో 57, క్లాజ్–6లో 55 ఓట్లు, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్‌కు క్లాజ్–3లో 1 ఓటు వచ్చింది. అలాగే తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్‌కు క్లాజ్ 3లో 4 ఓట్లు, క్లాస్ 6లో 3 ఓట్లు వచ్చాయి. సామాజిక తెలంగాణ మజ్దూర్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్, కార్మిక పరిషత్, బహుజన కార్మిక యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్లకు ఒక్క ఓటు పడలేదు.
నారాయణపేట, కోస్గి డిపోల్లో బాణం జోరు


