నారాయణపేట: బాలికలు విద్యతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకొని అన్నిరంగాల్లో రాణించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి రాజేందర్‌గౌడ్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లాకేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలికలు విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించే దిశగా పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. బాల్య వివాహాలను అరికట్టడంతో పాటు బాలికల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి సంగీత మాట్లాడుతూ.. బాలికల అభ్యున్నతి, విద్య, భద్రత, సాధికారతకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, విద్యార్థినులు సద్వినియోగం చేసుకొని ఉన్నతస్థాయికి చేరుకోవాలని, తల్లిదండ్రులు, సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం వివిధ క్రీడాపోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి శ్వేత, జిల్లా మహిళా సాధికారత కేంద్రం జిల్లా కో–ఆర్డినేటర్ నర్సింహులు, జెండర్ స్పెషలిస్ట్ అనిత, ఇన్‌చార్జి డీసీపీఓ కరిష్మా, సఖి సీఏ క్రాంతి, లీగల్ కౌన్సిలర్ రమాదేవి, అధ్యాపకులు సునీత, పారిజాత, ప్రభావతి, వెన్నెల, విద్య, శైలజ తదితరులు పాల్గొన్నారు.


