కోస్గి రూరల్: కందిలో చీడపీడల నివారణకు పురుగు ఉధృతిని బట్టి శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు మందులు వాడాలని కేంద్ర బృందం పరిశీలకుడు, పప్పుధాన్యాల మిషన్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అరుణ్‌కుమార్ శివారే సూచించారు. ఆత్మనిర్భర్ భారత్ పప్పుధాన్యాల మిషన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని తోగాపూర్‌లో పలువురు రైతులు సాగుచేసిన కంది పంటలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎదుగుదల, చీడపీడల ఉధృతి, పంట ఆరోగ్య పరిస్థితులపై రైతులకు సూచనలు చేశారు. పురుగు ఉధృతిని బట్టి వ్యవసాయశాఖ సిఫారస్ చేసిన మందులను తగిన మోతాదులో వినియోగించాలని, పప్పుధాన్యాల సాగులో శారస్త్‌రీయ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని కోరారు. కార్యక్రమంలో కమిషనరేట్ వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఏడీఏ రామకృష్ణ, వ్యవసాయ విస్తరణ అధికారులు అజయ్, వినోద్, పలువురు రైతులు పాల్గొన్నారు.


