మక్తల్: మున్సిపల్ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న రెండు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ఎస్.కిరణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మక్తల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో పాటు నాలుగు నెలలుగా పీఎఫ్ జమ చేయడం లేదని తెలిపారు. కార్మికులకు వచ్చే చాలీచాలని జీతాలను కూడా సక్రమంగా చెల్లించకపోవడంతో అవస్థలు పడుతున్నారన్నారు. ప్రతినెలా ఒకటో తేదీనే కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కృష్ణయ్య, బాలు, రామలింగయ్య, జాకీర్, మూర్తి, బాలకృష్ణ, నరేందర్, ఆకాశ్, బాలమ్మ, అంజి తదితరులు పాల్గొన్నారు.
ఏజెన్సీ విధానంరద్దు చేయాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేసే కాంట్రాక్ట్ ఏజెన్సీ విధానాన్ని రద్దుచేసి.. ప్రభుత్వమే నేరుగా వేతనాలు అందించే విధంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సురేశ్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా ఆస్పత్రి, మెడికల్ కళాశాలలో కాంట్రాక్టు కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రజారోగ్య రంగంలో దశాబ్దాలుగా పనిచేస్తున్న పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషంట్ కేర్ తదితర సిబ్బందికి కనీస వేతనాలు అందక.. ఉద్యోగ భద్రత లేక శ్రమ దోపిడీకి గురవుతున్నారన్నారు. జీఓ 60 ప్రకారం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు చెల్లిస్తామని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం వేతనాల చెల్లింపులో పారదర్శకత లోపించిందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఏజెన్సీ విధానానికి స్వస్తి పలికి.. కార్పొరేషన్ వ్యవస్థ తీసుకురావాలని కోరారు. అదే విధంగా కార్మికులకు 7 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు సంతోష్, లక్ష్మయ్య, దయానంద్, కరుణాకర్, శ్రీను, ప్రకాశ్ పాల్గొన్నారు.
జొన్నలు క్వింటా రూ.4,401
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం జొన్నలు క్వింటాకు గరిష్టంగా రూ. 4,401, కనిష్టంగా రూ. 4,221 ధర పలికింది. శనగలకు రూ. 5,259 ధర లభించింది. పెసరకు గరిష్టంగా రూ. 8,025, కనిష్టంగా రూ. 7,925, వేరుశనగ గరిష్టంగా రూ. 9,479, కనిష్టంగా రూ. 4,329, అలసందలు గరిష్టంగా రూ. 6,250, కనిష్టంగా రూ. 6,059 ధరలు పలికాయి. ఎర్రకందులు గరిష్టంగా రూ. 8,069, కనిష్టంగా రూ. 6,250, తెల్లకందులు గరిష్టంగా రూ. 7,989, కనిష్టంగా రూ. 6,700 ధరలు లభించాయి.
దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు మరవలేనివి
నారాయణపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు ప్రజలకు అందించిన సేవలు మరవలేనివని డీఎస్పీ నల్లపు లింగయ్య అన్నారు. సోమవారం శ్రీపాదరావు జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. సౌమ్య మనస్తత్వం గల దుద్దిళ్ల శ్రీపాదరావు ప్రజల మధ్యే ఉంటూ.. ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారన్నారు. స్పీకర్‌గా పనిచేసిన సమయంలో ఆయన నిజాయతీ, నిరాడంబరత ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. కార్యక్రమంలో ఆర్‌ఐ విజయభాస్కర్, ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్‌లాల్, ఎస్‌ఐలు పురుషోత్తం, ఆర్‌ఎస్‌ఐ శ్వేత తదితరులు పాల్గొన్నారు.


