పేట పురపాలికపై గులాబీజెండా ఎగరాలి
● మాజీ డిప్యూటీ సీఎం మహిమూద్ అలీ
నారాయణపేట: తెలంగాణ ఉద్యమ నేత.. తొలి సీఎం కేసీఆర్ బాటలో నడుస్తూ నారాయణపేట నియోజకవర్గాన్ని అన్నిరంగాల ప్రగతిలో పరుగులు పెట్టించి అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డికి దక్కుతుందని మాజీ డిప్యూటీ సీఎం మహిమూద్ అలీ అన్నారు. పుర ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్‌రెడ్డితో కలిసి 7, 8, 11, 12, 13, 18, 19, 23, 24 వార్డులో అభ్యర్థులతో ప్రచార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈసారి పుర ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను అధికసంఖ్యలో గెలిపించి పురపాలికపై బీఆర్‌ఎస్ జెండా ఎగురవేయాలని కోరారు. రెండేళ్ల రేవంత్ సర్కార్‌లో ప్రజలెవరూ మనశ్శాంతిగా జీవించడం లేదని.. ప్రజాపాలన అని చెప్పుకొనే సీఎం ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలవడం లేదన్నారు. ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చి 420 ప్రభుత్వంగా మిగిలిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరేస్తే రాబోయే రోజుల్లో ఎస్.రాజేందర్‌రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచేందుకు పునాదులు పడుతాయన్నారు. ఆయనను ఈసారి మంత్రి హోదాలో ఈ ప్రాంత ప్రజలు చూడడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆ సమయంలో బీఆర్‌ఎస్ శ్రేణులు ఒక్కసారిగా ఎస్‌ఆర్ రెడ్డి జిందాబాద్ అనే నినాదాలతో హోరెత్తించారు.


