పకడ్బందీగా భూ సర్వే
కోస్గి రూరల్: పట్టా భూములతో పాటు ప్రభుత్వ భూములను రక్షించేందుకు, పక్కాగా పర్యవేక్షణ చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం భూ భారతిలో భాగంగా భూ సర్వే చేపట్టిందని ఏడీ ల్యాండ్ సర్వే వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. గ్రామ నక్షాలు సక్రమంగా లేని గ్రామాల్లో సర్వే నిమిత్తం జిల్లాలోని నారాయణపేట, నర్వ, కోస్గి మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేశారు. అందులో భాగంగా శనివారం మండలంలోని కొత్తపల్లిలో భూ సర్వేపై అవగాహన కల్పించారు. మొదటి విడతలో ప్రభుత్వ భూమి, రోడ్లు, చెరువులు, కుంటలు సుమారు 72 ఎకరాల సర్వే చేపడతామన్నారు. రెండోవిడతలో 1,160 ఎకరాల పట్టాదారుల భూములు సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తామని తెలిపారు. 30 రోజుల్లో సర్వే పూర్తి చేస్తామని, రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టనున్నారని వివరించారు. సర్వేకు ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని, అప్పుడే 100 శాతం లక్ష్యం పూర్తవుతుందన్నారు. సర్వేయర్‌తో పాటు ఇద్దరు అసిస్టెంట్లను కేటాయించామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఆర్.సుభాష్, సర్వేయర్ అరుణ, కృష్ణ, గ్రామపంచాయతి అధికారులు తదితరులు పాల్గొన్నారు.


