
మద్దూరులో ఉద్రిక్తత
● ఓ వినాయకుడి నిమజ్జనానికి తరలింపు విషయంలో నిర్వాహకుల మధ్య గొడవ
● పోలీసుల లాఠీచార్జ్.. పలువురికి గాయాలు
మద్దూరు: నారాయణపేట జిల్లాలోని మద్దూరులో వినాయక నిమజ్జనం సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణంలో దాదాపు 40కిపైగా విగ్రహాలను ప్రతిష్టించగా.. ఇందులో పాతబస్టాండ్ దగ్గర రావులపల్లి రోడ్‌లో 35 అడుగుల విగ్రహాన్ని మొదటిసారి బాలహనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అయితే 9 రోజుల పాటు పూజలందుకున్న గణనాథులను గురువారం రాత్రి నిమజ్జనానికి తరలించి.. శుక్రవారం స్థానిక చెరువులో నిమజ్జనం చేయాలని తీర్మానించారు. ఈ క్రమంలో బాలహనుమాన్ యూత్ నిర్వాహకులు తాము శనివారం నిమజ్జనం చేస్తామని చెప్పడంతో తెలియజేడంతో గురువారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌లో అన్ని మండలపాల నిర్వాహకులను పిలిచి ఎస్‌ఐ విజయ్‌కుమార్ మాట్లాడారు. శాంతియుతంగా చేసుకోవాలని ఎస్‌ఐ సూచించారు. అయితే బాలహనుమాన్ యూత్ నిర్వాహకులు శనివారం వేస్తామని తేల్చిచెప్పడంతో మండపాల నిర్వాహకుల మధ్య పోలీస్‌స్టేషన్‌లోనే గొడవ జరగగా ఎస్‌ఐ సర్దిచెప్పారు.
పాతబస్టాండ్ చౌరస్తాలోకి విగ్రహాలు
పట్టణంలోని వినాయకులన్నీ గురువారం రాత్రి నిమజ్జనానికి తరలించి శుక్రవారం సాయంత్రానికి పాతబస్టాండ్ చౌరస్తాకు చేరుకున్నాయి. ఈ క్రమంలో అన్ని మండపాల నిర్వాహకులు 35 అడుగుల విగ్రహం దగ్గరికి వచ్చి నిమజ్జనానికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న కోస్గి సీఐ సైదులు, స్థానిక ఎస్‌ఐ విజయ్‌కుమార్ వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఎంతకూ వినకపోవడంతో నారాయణపేట నుంచి ప్రత్యేక బలగాలను పిలిపించి 35 అడుగుల వినాయకుని దగ్గర ఉన్న యువకులపై లాఠీచార్జ్ చేయడంతో చాలామందికి గాయాలయ్యాయి. పోలీసుల లాఠీచార్జ్ అనంతరం విషయం తెలుసుకున్న డీఎస్పీ లింగయ్య ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు.

మద్దూరులో ఉద్రిక్తత