
నిమజ్జనానికి ముస్తాబు..
● శోభాయాత్రలో అలంకరణలే ప్రత్యేకం
● నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ
● నేటి రాత్రి నుంచి గణనాథుల తరలింపు
● రేపు సాయంత్రం తర్వాత విగ్రహాల జలప్రవేశం
నారాయణపేట రూరల్: చేనేత, బంగారానికే కాకుండా వినాయక ఉత్సవాల నిర్వహణలోనూ నారాయణపేటకు రాష్ట్రంలోనే ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఎక్కడైనా విశిష్ఠ రూపాల్లో గణనాథులను ప్రతిష్ఠించడం.. మండపాల్లో వివిధ రకాలైన అలంకరణలు చేయడం చూస్తుంటాం. కానీ పేటలో మాత్రం అందుకు భిన్నంగా శోభాయాత్రలో విద్యుత్ దీపాలతో, ఇతిహాసిక సన్నివేశాలు, కదులుతున్న బొమ్మలతో కూడిన అలంకరణలు చేస్తుంటారు. ఆగస్టు 27న చవితి గడియల్లో ప్రతిష్ఠించిన గణనాథులకు నవరాత్రులు ప్రత్యేక పూజలు చేసి, అనంత చతుర్ధశి గడియల్లో గంగ చెంతకు చేరనున్నాడు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, నైవేద్యాలను సమర్పించి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదానం చేపట్టారు. నిమజ్జన శోభాయాత్రను తిలకించడానికి చుట్టు పక్కల జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.
పటిష్ట బందోబస్తు
ఉమ్మడి పాలమూర్ జిల్లాలోనే ఎంతో ప్రఖ్యాతి చెందిన నారాయణపేట పట్టణ గణేష్ నిమజ్జనానికి పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులతో పాటు రెండు స్పెషల్ బెటాలియన్ల సిబ్బందిని రప్పించారు. అదనంగా ఒక ఎస్పీతో పాటు ఒక అడిషనల్ ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, 15 మంది ఎస్‌ఐలతో పాటు 200 మందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అన్ని ప్రార్థనా మందిరాలు, ముఖ్య కూడళ్లు, గణేష్‌మార్గ్‌లో పోలీసులతో పాటు స్పెషల్ పార్టీ సిబ్బంది మోహరించారు. అదేవిధంగా అన్ని మండపాలతో పాటు ఊరేగింపు జరిగే ప్రాంతాలు, నిమజ్జనం చేసే కొండారెడ్డిపల్లి చెరువు, బారంబావి తదితర ప్రాంతాల్లో బాంబ్‌స్కాడ్ బృందం తనిఖీలు చేపట్టింది.
సీసీ కెమెరాలు.. జియో ట్యాగింగ్‌లు
గతంలో ఎన్నడూ లేని విధంగా గణేష్ ఉత్సవాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. పట్టణంలో 141 వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించగా.. వీటన్నింటికి జియో ట్యాగింగ్ చేశారు. అదే విధంగా అన్ని కూడళ్లు, గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరిగే రోడ్లపై సీసీ కెమరాలు ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అధికారులు, ఐటీ కోర్ సిబ్బందితో 24 గంటల పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి మండపాల నుంచి బయటకు వచ్చే గణనాథులను పట్టణ ప్రధాన రహదారి మీదుగా శనివారం సాయంత్రం వరకు కొండారెడ్డిపల్లి చెరువుకు నిమజ్జనానికి తరలిస్తారు. అక్కడ అవసరమైన క్రేన్లను ఏర్పాటు చేశారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీసు సిబ్బందితో పాటు వైద్య ఆరోగ్య శాఖల వారికి విధులు కేటాయించారు. ఉత్సవ సమితి, విశ్వహిందూ పరిషత్ నాయకులు సైతం సహకారం అందిస్తున్నారు.

నిమజ్జనానికి ముస్తాబు..

నిమజ్జనానికి ముస్తాబు..