
‘వినూత్న’ బోధకుడికి పట్టం
● ఎస్‌జీటీ విభాగంలో
రాష్ట్రస్థాయి అవార్డు
● ఉత్తమ ఉపాధ్యాయుడిగాకుందేటి నర్సింహ
నారాయణపేట రూరల్: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 5 న ప్రభుత్వం తరఫున విద్యాశాఖ ఏటా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి అవార్డులు ఇస్తుంది. ఈ క్రమంలో జిల్లా ఏర్పాటు తర్వాత ఆరు సార్లు ఈ ఎంపికలు జరగగా.. 2019, 2021, 2023లో పలువురు టీచర్లు దరఖాస్తు చేసుకోగా ఎవరూ ఎంపిక కాలేదు. అయితే 2020లో తొలిసారి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరుగురు ఎంపిక కాగా.. వారిలో ముగ్గురు నారాయణపేట టీచర్లు కావడం ప్రత్యేకం. 2022లో ఒక మహిళ ఉపాధ్యాయురాలికి అవార్డు వరించగా.. ఇప్పుడు ఉపాధ్యాయుడు నర్సింహ ఎంపికయ్యారు.
● నాగర్‌కర్నూల్ జిల్లా గగ్గలపల్లికి చెందిన కుందేటి నర్సింహ 2008 డీఎస్సీలో ఎస్‌జీటీ ఉపాధ్యాయుడిగా ఎంపికై వెల్దండ మండలం గోకారం ప్రాథమిక పాఠశాలలో విధుల్లో చేరారు. 2015లో జరిగిన బదిలీల్లో నారాయణపేట జిల్లా కోస్గి మండలం బోలవానిపల్లి ప్రాథమిక పాఠశాలకు వచ్చారు. అక్కడే తొమ్మిదేళ్ల పాటు విధులు నిర్వహించి గ్రామస్తుల మన్ననలు పొందారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనంతో పాటు అసంపూర్తిగా ఉన్న అదనపు తరగతి గదులను కాంట్రాక్టర్‌తో మాట్లాడి సొంతంగా రూ.2లక్షలు ఖర్చు పెట్టి బాగు చేయించారు. తాగునీరు, టాయిలెట్స్ ఏర్పాటు చేయడంతో గోడలకు చక్కటి రంగులతో బొమ్మలు వేయించారు. ఏడాదిలోపే ఆ గ్రామం నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు స్థానిక ప్రభుత్వ పాఠశాలకు వచ్చారు. 20 మంది నుంచి 90 మందికి ఎన్‌రోల్‌మెంట్ పెంచారు. ఆవరణలో 50 మొక్కలను నాటి వాటిని సంరక్షించారు. కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజనానికి కూరగాయలు, ఆకుకూరలను పండించేవారు. బోధన విషయంలో ఆయన తీరు అందరు టీచర్ల కంటే భిన్నంగా ఉంటుంది. పాఠ్యాంశాలను కథలు, నాటికలు, ఆటపాటలతో ఏకపాత్రాభివినయం ద్వారా బోధన చేస్తారు. రెండుసార్లు హైదరాబాద్ రవీంద్రభారతిలో ఇక్కడి చిన్నారులు ప్రదర్శనలు ఇచ్చారు. 2024 జూన్‌లో బోలవానిపల్లి ప్రాథమిక పాఠశాల నుంచి బదిలీ అయ్యారు. అయితే రిలీవ్ చేయరాదని సీఎం రేవంత్‌రెడ్డి దగ్గరకు వెళ్లి గ్రామస్తులు వినతిపత్రం అందించడంతో ఆరు నెలలు పాత పాఠశాలలోనే విధులు నిర్వహించారు. వారం రోజుల క్రితం కున్సి ప్రాథమిక పాఠశాలకు పీఎస్ హెచ్‌ఎంగా పదోన్నతిపై వచ్చారు. ఆయనను కలెక్టర్ సిక్తాపట్నాయక్, డీఈఓ ఎండీ గోవిందరాజు, పీఆర్టీయూ, తపస్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యాద్గీర్ జనార్దన్‌రెడ్డి, శేర్‌కృష్ణారెడ్డి, నర్సింహ, రెడ్డప్ప అభినందించారు.