
ఆడపిల్లలు చదివితే సమాజానికి మేలు
మక్తల్: ఆడపిల్లలు చదువుకుకుంటే కుటుంబంతో పాటు సమాజం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ సిక్తాపట్నాయాక్ అన్నారు. గురువారం మండలంలోని సగంబండ శివారులో ఉన్న కేజీబీవీ, ఎస్సీ గురుకుల బాలికల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో నిర్వహణ రికార్డులు, స్టాక్ రూం, వంటగది మరుగుదొడ్లు తదితర వాటిని పరిశీలించారు. వంట గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నాణ్యమైన కూరగాయలు వాడాలని ఏజెన్సీ మహిళలకు సూచించారు. భోజనాన్ని ప్రతి రోజు పరిశీలించిన తర్వాతే విద్యార్థినులకు వడ్డించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పాఠ్యాంశాలను బోధించాలని, చదువులో వెనకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వం కల్పించిన వసతులను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకొని, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్‌కుమార్, ఎంపీడీఓ రమేష్‌కుమార్, ప్రిన్సిపాల్ రాధిక, చంద్రకళ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.