
దరఖాస్తు చేసుకో.. అవార్డు పట్టుకో
నారాయణపేట రూరల్: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవానికి విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే వినూత్న బోధన, విధుల్లో అంకితభావం, విద్యార్థుల సంఖ్య పెంచడం, హరితహారం, డ్రాపౌట్స్ పిల్లలు స్కూల్‌కు తీసుకుని రావడం, విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేసిన ఉపాధ్యాయులకు అవార్డులను అందిస్తోంది. అవార్డులకు ఎంపిక ప్రక్రియ మాత్రం సంబంధిత టీచర్ ఆయా లక్షణాలు తనకు ఉన్నాయంటూ తెలుపుతూ దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయాల్సిన బాధ్యత జిల్లా విద్యాశాఖ మీద ఉంది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 47 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేస్తున్నారు.
బహిరంగ నోటిఫికేషన్ లేకుండానే..
ఆలస్యంగా నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు ఈ నెల 3 వరకు దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించగా చాలా మంది టీచర్లు ఆసక్తి చూయించలేదు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు పలువురు టీచర్లపై ఒత్తిడి పెట్టి పోటాపోటీగా నామమాత్రపు ఫొటోలు, కార్యక్రమ వివరాలతో కూడిన ఫైళ్లతో అప్‌లై చేయించారు. డీఐఈఓ, ఒక ఎంఈఓ, ఒక జీహెచ్‌ఎంతో కూడిన కమిటీ మార్కులు వేసినా చివరి వరకు జాబితాను బయటపెట్టకుండా విద్యాశాఖ అధికారులు తాత్సారం చేశారు. వాస్తవంగా క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే కాగితాలనే ప్రామాణికంగా తీసుకుని దరఖాస్తు చేసుకున్న అందరిని ఉత్తమ ఉపాధ్యాయులగా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఎక్కడ కూడా కనీసం పత్రిక ప్రకటన సైతం ఇవ్వకుండా లోపలలోపల ప్రక్రియ చేయడం విమర్శలకు తావిస్తోంది.
ఆర్డీఓ కార్యాలయంలో సమావేశం..
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలను విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10.30గంటలకు స్థానిక ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎమ్మెల్యే ఫర్ణికారెడ్డి హాజరుకానున్నారు.
ఎంపికపై విమర్శలు
ఉత్తమ ఉపాధ్యాయులుగా విద్యాశాఖ ఎంపిక చేసిన వారిలో చాలా మంది పాఠశాలకు ఆలస్యంగా రావడం, తరగతి గదిలో నిద్రపోయేవారు, పిల్లలను గాలికి వదిలి స్కూల్ బయట ఇతర పనులు చేసేవారు, పనిచేస్తున్న చోట తోటి ఉపాధ్యాయులతో సక్యతగా లేకుండా పిల్లల ముందే గొడవలు పడ్డవారు సైతం కొందరు ఉండటం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. రెండేళ్లుగా ఈ తంతును పరిశీలిస్తే 2023లో 53మంది, 2024లో 44మంది దరఖాస్తు చేసుకోగా అందరికీ ఇచ్చారు. అదే పరంపర కొనసాగిస్తూ ఈ ఏడాది సైతం నామమాత్రంగా కార్యక్రమం పూర్తి చేయాలనే లక్ష్యంతో జిల్లా విద్యాశాఖ పని చేసింది తప్పా.. నిజమైన టీచర్లకు గౌరవించాలనే ఉద్దేశంతో ముందుకు పోలేదని పలువురు ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు.
ఈ ఏడాది 47 దరఖాస్తులు..
ఈ విద్యా సంవత్సరంలో నిర్వహిస్తున్న టీచర్స్ డే కార్యక్రమానికి ఉత్తమ ఉపాధ్యాయులుగా 47మందిని ఎంపిక చేశారు. గతంలో నేరుగా డీఈఓ కార్యాలయంలో దరఖాస్తులు ఇచ్చేవారు. కానీ ఈ సారి మండలాల పరిధిలోనే ఎంఈఓ వాటిని స్వీకరించి డీఈఓ కార్యాలయానికి పంపించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన త్రిమెన్ కమిటీ దరఖాస్తులను పరిశీలించి అందరిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసింది. ఆ జాబితాను కలెక్టర్ పరిశీలను పంపించగా గురువారం వివరాలు వెల్లడించారు.
అర్జీ పెట్టుకున్నవారందరూ ఉత్తమ ఉపాధ్యాయులే
ప్రతి సంవత్సరం జిల్లా విద్యాశాఖ వింత పోకడ
సర్వేపల్లి జయంతిని పురస్కరించుకొని టీచర్లకు అవార్డులు
ఈ ఏడాది 47 దరఖాస్తులు

దరఖాస్తు చేసుకో.. అవార్డు పట్టుకో