
నర్వ అభివృద్ధికిప్రతిపాదనలు ఇవ్వండి
నారాయణపేట: నర్వ మండల అభివృద్ధి కోసం అధికారులు కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా, వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక రూపంలో ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ చాంబర్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆస్పిరేషన్ నర్వ బ్లాక్ కింద చేపట్టాల్సిన వినూత్న ప్రాజెక్టులు, కొత్త ఆలోచనలపై చర్చ జరిగింది. కీలక పనితీరు సూచికలు సాధించడానికి ప్రతి శాఖ తమవంతుగా చురుకై న చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల ఆదాయం పెంచే ప్రాజెక్టులు, స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధి కల్పించే కార్యక్రమాలు, నీటి సంరక్షణ చర్యలు, పాడి ప్రాజెక్టులు వంటి అంశాలపై అధికారులు విస్తృతమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలన్నారు. ఇక విద్య, వైద్య, పశు సంవర్ధక, వ్యవసాయ శాఖల అధికారులు తమ శాఖల్లో అత్యవసరమైన, ప్రజలకు ఉపయోగపడే సృజనాత్మక ప్రాజెక్టులను రూపకల్పన చేసి, డిటైల్డ్ రిపోర్ట్ రూపంలో ఇవ్వాలని కలెక్టర్ ప్రత్యేకంగా ఆదేశించారు. అధికారులు నిబద్ధతతో విధులు నిర్వహిస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరే ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకోవాలి అని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, డిఆర్డిఓ మొగలప్ప, డిఎంఅండ్‌హెచ్‌ఓ జయచంద్రమోహన్, డిఏఓ జాన్ సధాకర్, డిఈఓ గోవిందరాజులు, నర్వ మండలంలోని అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి
నారాయణపేట రూరల్: బాలికలు అన్నిరంగాల్లో రాణించాలని, విద్యావకాశాలను సద్వినియోగం చేసుకొని, ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సంయుతంగా నారాయణపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలికలు ఆరోగ్యం, స్వీయరక్షణకు మెళకువలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు బాలికా విద్యపై ప్రత్యేక శ్రద్ద, లింగ సమానత్వం , బాల్య వివాహాల నిర్మూలనకు బాధ్యతాయుతంగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.