
గంగమ్మ ఒడికి గణపయ్య..
నారాయణపేట రూరల్: నవరాత్రులు.. భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న గణనాథుడు అనంత చతుర్ధశి గడియల్లో గంగమ్మ ఒడికి చేరాడు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఎంతో పేరున్న నారాయణపేట వినాయక నిమజ్జనం శుక్రవారం రాత్రి మొదలై శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. దాదాపు 30 గంటలకు పైగా ప్రత్యేక వాహనాల్లో పట్టణ పురవీధుల గుండా జరిగిన శోభాయాత్రలో చారిత్రక, ఇతిహాసిక, రాజకీయ అంశాలతో కలిపి లంబోదరులను అలంకరించారు. మహిళలు, పురుషులు, చిన్న, పెద్ద తేడా లేకుండా నృత్యాలు చేశారు. కోలాటం, అడుగుల భజనలు బాగా ఆకట్టుకున్నాయి. చౌక్‌సెంటర్‌లో వీహెచ్‌పీ, ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో వినాయకులకు పూజలు చేసి మండప నిర్వహకులకు జ్ఞాపికలు అందించి వీడ్కోలు పలికారు. కొండారెడ్డిపల్లి చెరువు దగ్గర మున్సిపల్, రెవిన్యూ, వైద్య, పోలీసుశాఖల సమన్వయంతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిమజ్జనం పూర్తిచేశారు. చిన్న విగ్రహాలను నేరుగా జల ప్రవేశం చేయించగా.. భారీ ప్రతిమలను క్రేన్ సహాయంతో నిమజ్జనం చేశారు. ఎస్పీ యోగేష్‌గౌతమ్ భద్రతా ఏర్పాట్లు ప్రత్యేక్షంగా పర్యవేక్షించగా, కంట్రోల్ రూంలో పోలీసు సిబ్బంది సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. స్వచ్ఛంద సంస్థలు అన్నం ప్యాకెట్లు, తాగునీరు పంపిణీ చేశారు.
ఉద్రిక్తతల వేళ నిరాడంబరంగా..
మద్దూరు: ఎంతో వైభోవంగా నిర్వహించాల్సిన వినాయకుడి నిమజ్జనోత్సవం ఉద్రిక్తతల నేపథ్యంలో నిరాడంబరంగా సాగింది. శుక్రవారం రాత్రి పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా వివాదం తలెత్తడం.. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో నిర్వాహకులు వినాయక విగ్రహాలను పాతబస్టాండ్ చౌరస్తాలో నిలిపి వెళ్లిపోయారు. దీంతో వాహనాలన్నింటిని పోలీస్, మున్సిపల్ సిబ్బంది కలిసి స్థానిక కాచెరువు వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. అలాగే బాలహనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 35 అడుగుల మహా గణపతిని కూడా డీఎస్పీ లింగయ్య దగ్గరుండి నిమజ్జనానికి తరలించారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల వరకు వినాయక నిమజ్జనం కొనసాగింది.
‘పేట’లో వినాయక నిమజ్జనం పూర్తి
శోభాయాత్రలో ఆకట్టుకున్నఅలంకరణలు
30 గంటలపాటు కొనసాగినఊరేగింపు