
ఉపాధ్యాయులే మార్గదర్శకులు
నారాయణపేట రూరల్: ఉపాధ్యాయులు భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. స్థానిక ఆర్డిఓ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూజలు చేసి మాట్లాడారు. సమాజానికి ఉపాధ్యాయులు వెన్నెముక లాంటి వారిని, ప్రజలలో చైతన్యం తీసుకుని వచ్చి దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. ప్రతి విద్యార్థి గమ్యం చేరుకునేందుకు టీచర్ల పాత్ర ఎంతో ముఖ్యమైందన్నారు. అన్ని రంగాలను తయారు చేసేది ఉపాధ్యాయులేనని కొనియాడారు. వ్యవస్థను నిర్ణయించే అధికారం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుందన్నారు. వెనకబడిన నారాయణపేట లాంటి జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి టీచర్ల కృషి వెలకట్టలేనిది అన్నారు. అనంతరం 51 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఏఎంఓ విద్యాసాగర్, శ్రీనివాస్, నాగార్జునరెడ్డి, భాను ప్రకాష్ పాల్గొన్నారు.