నాటకరంగ పితామహుడు బళ్లారి రాఘవ | - | Sakshi
Sakshi News home page

నాటకరంగ పితామహుడు బళ్లారి రాఘవ

Aug 3 2026 3:45 AM | Updated on Aug 3 2026 3:45 AM

బొమ్మలసత్రం: తెలుగు ప్రజలకు తన నాటకాల ద్వారా సామాజిక స్పృహ నింపి నాటకరంగ పితామహుడిగా నిలిచిపోయిన వ్యక్తి బళ్లారి రాఘవ అని అడిషనల్‌ ఎస్పీ ఖాదర్‌బాషా అన్నారు. ఆదివారం బళ్లారి రాఘవ జయంతిని జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో పోలీసులు ఘనంగా నిర్వహించారు. అడిషనల్‌ ఎస్పీ ఖాదర్‌బాషా, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ చిన్నికృష్ణ, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు బాబు, విజయ్‌, సురేష్‌, ఆర్‌ఎస్‌ఐలు చరణ్‌, హర్షవర్ధన్‌రెడ్డి తదితరులు బళ్లారి రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఖాదర్‌బాషా మాట్లాడుతూ బళ్లారి రాఘవ నాటకాల ద్వారా సమాజంలో నెలకొన్న దురాచారాలను ప్రశ్నించేవాడన్నారు. ప్రజల్లో ఆయన నాటకాలు చైతన్యం కలిగించి జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలో దిశానిర్దేశం చేసేలా ఉండేవన్నారు. యువత భవిష్యత్తుపై ఎన్నో నాటకాలు చేసి వారిలో మనోధైర్యాన్ని నింపేవారన్నారు.

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

నంద్యాల: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌తోపాటు అన్ని రెవెన్యూ డివిజన్‌, మండల పరిషత్‌, మునిసిపల్‌ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలున్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం కాల్‌ సెంటర్‌ నంబర్‌ 1100కు ఫోన్‌ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. meekoram.a p.gov.in వెబ్‌సైట్‌లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చన్నారు.

ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలి

నంద్యాల(న్యూటౌన్‌): ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(ఏపీటీఎఫ్‌) జిల్లా ప్రధాన కార్యదర్శి శివయ్య కోరారు. స్థానిక ఫెడరేషన్‌ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం టీచర్లకు వివిధ పనులు అప్పగిస్తుండటంతో విద్యాబోధనకు ఆటంకం కలుగుతోందన్నారు. మారుమూల ప్రాంతాల్లో నెట్‌వర్క్‌, విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద ఆండ్రాయిడ్‌ సెల్‌ ఫోన్లు లేకపోవడం తదితర సమస్యలతో టీచర్లు నిత్యం సతమతమవుతున్నారన్నారు. సమస్యలను పరిష్కరించకుండా ఉపాధ్యాయులపై ఒత్తిడి చేయడం సబబు కాదన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థుల అటెండెన్స్‌, ఎండీఎం నామినేషన్‌, ఫీడ్‌ బ్యాక్‌, ఆయా అటెండెన్స్‌, ఇన్‌స్పెక్షన్‌ ఫామ్‌, చిక్కీలు, ఎగ్స్‌ ఇండెంట్‌, రిసిఫ్ట్‌ తదితర పనులతో ఎల్లప్పుడూ ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేయడం తగదన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను విముక్తి కల్పించాలని కోరారు. సమావేశంలో ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి, కార్యవర్గ సభ్యులు జాకీర్‌ హుస్సేన్‌, వీరేశ్వర్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి జిల్లా సబ్‌ కమిటీ సభ్యులు దస్తగిరి బాషా, సుబ్బారెడ్డి, నారాయణరెడ్డి, నాగార్జున, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

హైవేపై ఎలుగుబంటి హల్‌చల్‌

పాములపాడు: మండలంలోని ఎర్రగూడూరు గ్రామ సమీపంలో జెమ్మి చెట్టు నేషనల్‌ హైవేను దాటుతూ ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు ఎలుగుబంటిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఈ క్రమంలో పెద్ద శబ్దంతో హారన్‌లు కొడుతూ కేకలు వేశారు. దీంతో ఎలుగుబంటి పరుగున అడవిలోకి వెళ్లిపోయింది. ఎలుగుబంటి విషయం చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో అటువైపు వెళ్లేందుకు ప్రజలు సాహసించలేదు. అటవీ అధికారులు తక్షణ చర్యలు చేపట్టి అటవీ సమీప గ్రామాల్లోకి అడవి జంతువులు రాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement