అన్యాయంగా అరెస్ట్‌ చేశారు | - | Sakshi
Sakshi News home page

అన్యాయంగా అరెస్ట్‌ చేశారు

Aug 3 2026 3:45 AM | Updated on Aug 3 2026 3:45 AM

అన్యాయంగా అరెస్ట్‌ చేశారు

ఎమ్మెల్యే విరూపాక్షిని వెంటనే విడుదల చేయాలి

అక్రమంగా ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్‌

ఎమ్మెల్యేకు రక్షణ లేదా?

ఆదోని/ఆలూరు రూరల్‌/ఆలూరు/

చిప్పగిరి/కర్నూలు (టౌన్‌): ప్రజల గళాన్ని అసెంబ్లీలో వినిపించాల్సిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేశారు. ‘రెడ్‌బుక్‌’ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. అందరూ నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి వేళ బీభత్సం సృష్టించి బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా భయానక వాతారణంలో పోలీస్‌స్టేషన్‌లోనే నిర్బంధించారు. ఆదివారం రాత్రి సమయంలో జైలుకు హాజరు పరిచి జడ్జి రిమాండ్‌కు ఆదేశించడంతో కర్నూలు సబ్‌జైలుకు తరలించారు. ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేశారని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. చిప్పగిరిలో భారీగా ధర్నా నిర్వహించి చంద్రబాబు ప్రభుత్వ బెదిరింపులకు బెదరబోమని హెచ్చరించారు.

పోలీసుల ‘పచ్చ’పాతం

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు మరో 34 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు టీడీపీ నేతల సేవల్లో తరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విరూపాక్షి ఎమ్మెల్యే ఎన్నికై రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా ఆయనకు పోలీసులు సరైన గుర్తింపును ఇవ్వలేదు. టీడీపీ నాయకుల జన్మదినోత్సవాలకు వెళ్లడం, వారి మన్ననలను అందుకోవడం ఆలూరు పోలీసులకు రివాజుగా మారింది. ఎమ్మెల్యే విరూపాక్షి తిరుగులేని నాయకుడిగా ఎదుగుతుండటాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో పోలీసులతో పథక రచన చేశారు.‘రెడ్‌బుక్‌’ రాజ్యాంగం అమలు చేసేందుకు పక్కాగా ప్రణాళిక రచించి అమలు చేశారని ఎమ్మెల్యే అక్రమ అరెస్ట్‌ చేయించారని అర్థమవుతోంది.

భయభ్రాంతులకు గురిచేసి..

చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త గిరిపై శనివారం రాత్రి టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. టీడీపీకి చెందిన వారు తనపై దాడికి పాల్పడుతున్నారని గిరి ఇచ్చిన సమాచారం మేరకు ఎమ్మెల్యే విరూపాక్షి, సోదరుడు శ్రీరాములు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల అక్కడికి వెళ్లారు. వారిపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే విరూపాక్షి చిప్పగిరి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిని పట్టించుకోకుండా టీడీపీ నేతల ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 3 గంటలకు ఎమ్మెల్యే ఇంటికి పోలీసుపలు వెళ్లారు. ప్రజాప్రతినిధి అనే గౌరవం లేకుండా ఆయన ఇంటి సీసీ కెమెరాల వైర్లు కోసి, ఇంటి తాళాలు పగులగొట్టారు. ఎమ్మెల్యే విరూపాక్షిని బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెయని పరిస్థితి. ఇంట్లో ఉన్న మహిళలు భయభ్రాంతులకు గురైనా పోలీసులు లెక్కచేయలేదు.

బాధితులపైనే కేసు నమోదు

దాడి చేసిన వారిపైన కాకుండా పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు నమోదు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాడిలో గాయపడి చేయి విరిగిన ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్‌ విషయం పక్కన పెట్టారు పోలీసులు తలకు చిన్న గాయమైన వ్యక్తికి ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి తీవ్రగాయాలైనట్లు సర్టిఫికెట్‌ తీసుకున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షి తమ ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డారని తప్పుడు వాగ్మూలం తీసుకున్నా ఎమ్మెల్యేతో పాటు 34 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరగకముందే ఎమ్మెల్యేపైనే తీవ్రమైన కేసు నమోదు చేయడం అనేక అనుమానాలకు తావిచ్చింది.

సబ్‌ జైలుకు తరలింపు

ఎమ్మెల్యేతో పాటు మరో 12 మందికి ఆదివారం సాయంత్రం 8 గంటలకు ఆలూరు కోర్టులో హాజరు పరచగా ఆలూరు జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి హేమ వీరికి 14 రోజులు రిమాండ్‌కు ఆదేశించారు. పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు 12 వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ప్రత్యేక బస్సులో ఆదివారం రాత్రి 11:30గంటలకు కర్నూలు సమీపంలోని పంచలింగాల వద్ద ఉన్న సబ్‌జైలుకు తరలించారు.

కనీస సమాచారం ఇవ్వకుండా రాత్రి సమయంలో దొంగచాటున ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షిని అరెస్టు చేయడాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు ఖండించారు. చిప్పగిరిలోని అంబేద్కర్‌ కూడలిలో రెండు గంటల పాటు నిసరన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యేను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ గుండాలు దాడి చేస్తే పరామర్శిండానికి వెళ్లిన ఎమ్మెల్యేపై అదే టీడీపీ గుండాలు దాడి చేసినా పోలీసులు పట్టించుకోవడం దారుణమన్నారు. అక్రమ కేసులతో అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. మాజీ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌ రెడ్డి, కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, శ్రీదేవి, ఎమ్మెల్సీలు మధుసూదన్‌, ఇసాక్‌, మాజీ ఎంపీ బుట్టారేణకు, మాజీ మంత్రి శైలజానాథ్‌, మాజీ మేయర్‌ బీవై రామయ్య, మాజీ గ్రంథాలయ చైర్మన్‌ సుభాష్‌ చంద్రబోస్‌, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కురువ శశికళ, ఆలూరు నియోజకవర్గ నాయకులు వైకుంఠం మల్లికార్జున చౌదరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ చంద్రబాబు ప్రభుత్వమే అధికారంలో ఉండబోదని పోలీసులు గుర్తించుకోవాలన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరసనలో వైఎస్సార్‌సీపీ చిప్పగిరి మండల కన్వీనర్‌ మల్లికార్జున, వైఎస్సార్‌సీపీ నాయకులు జూటూరు మారయ్య, పామిడి వీరయ్య, గుంతకల్లు బాబు, కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హత్యాయత్నం కేసు నమోదు

భగ్గుమన్న వైఎస్సార్‌సీపీ నేతలు

చిప్పగిరిలో భారీ ధర్నా

‘రెడ్‌బుక్‌’కు బెదరబోమని హెచ్చరిక

కార్యకర్త ఆపదలో ఉన్నాడని సీఐకి ఫోన్‌ చేస్తే స్పందించలేదు. సరే చచ్చిపోతాడేమోనని మా ఆయన వెళ్తే తిరిగి ఆయన పైనే కేసు పెట్టారు. రాత్రి 11 గంటలకు కేసు విషయమై వెళ్తే అర్ధరాత్రి వరకు అక్కడే ఉంచుకున్నారు. ఆ తర్వాత మేం ఇంటికొచ్చి నిద్రిస్తున్నప్పుడు తెల్లవారుజామును 3 గంటలకు వచ్చి పోలీసులు తలుపులు పగులగొట్టి బలవంతంగా ఈడ్చుకెళ్లారు. వస్తున్నాం అని చెబుతున్నా కూడా దౌర్జన్యంగా లాక్కెళ్లారు. ఇంట్లో తోడు ఉంటాడని గుంతకల్లు నుంచి వచ్చిన మా అబ్బాయిని కూడా బలవంతంగా తీసుకెళ్లారు. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుని పరిస్థితి ఏంటి?

– రామంజనమ్మ, ఎమ్మెల్యే విరూపాక్షి భార్య

కార్యకర్తను పరామర్శించేందుకు వెళితే తనపై అక్రమ కేసు నమోదు చేశారని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి విలేకరులకు తెలిపారు. సబ్‌జైల్‌ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశపాలన కొనసాగిస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement