నంద్యాల(వ్యవసాయం): నంద్యాల కోర్టు కాంప్లెక్స్‌లో ఆదివారం 9వ అదనపు జిల్లా కోర్టుతో పాటు రెండవ, మూడవ, నాల్గవ అదనపు కోర్టులను ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.కృష్ణమోహన్, జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి, జస్టిస్ ఎ.హరిహరనాథ శర్మ ప్రారంభించారు. అదనపు కోర్టుల్లో సర్వ మత ప్రార్థనలు నిర్వహించి కాల్‌వర్క్‌ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతూ.. అదనపు కోర్టుల ఏర్పాటు కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని, ఇది కక్షిదారులకు ఎంతో ఉపయోగమన్నారు. జూనియర్ న్యాయవాదులు వృత్తి ప్రావీణ్యం పెంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది మాట్లాడుతూ.. త్వరలో ఉమ్మడి జిల్లాలో మిగిలిన అనదపు కోర్టులను ప్రారంభిస్తామన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవీఎన్ ప్రసాద్, ప్రతాపరెడ్డి, గౌరీశంకర్ ఆధ్వర్యంలో జడ్జీలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ కోర్టుల జడ్జీలతో పాటు సీనియర్ న్యాయ వాదులు రామసుబ్బయ్య, పెద్ది శ్రీనివాసులు, తిమ్మారెడ్డి, హుసేన్‌బాషా, సుబ్బరాయుడు, శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, తులసిరెడ్డి, కృపావతి, వివేకానందరెడ్డి, రాజేశ్వరరెడ్డి, వెంకటేశ్వర్లు, మహమ్మద్ రఫీ, రామ్మోహన్‌రెడ్డి, గోళ్ల జయకృష్ణ, ఖలీల్, తిరుపతి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.


