● ఒకే రోజు వేర్వేరుగా కోట్ల,
ధర్మవరం కార్యక్రమాలు
డోన్: తెలుగుదేశం పార్టీలోని రెండు ప్రధాన వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న చందంగా తయారైంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం రెండు వర్గాలు ఏ ఒక్క కార్యక్రమంలో కూడా కలిసి పాల్గొన్న సంఘటన లేదు. చాలాసార్లు తమ పట్ల ఎమ్మెల్యే వర్గం వివక్ష కనబరుస్తోందని ధర్మవరం సుబ్బారెడ్డి వర్గీయులు బాహాటంగా విమర్శలు చేశారు. ఆ మేరకు పార్టీ అధినేతకు ఫిర్యాదు చేశారు. గత శనివారం తనకు కనీస సమాచారం ఇవ్వకుండా తన స్వగ్రామం ధర్మవరం గ్రామంలో రచ్చబండ ప్రారంభోత్సవం పేరుతో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పర్యటించడం ధర్మవరం సుబ్బారెడ్డికి ఆగ్రహం కలిగించింది. దీంతో తన మద్దతుదారుడైన కోడుమూరు నియోజకవర్గంలోని కోట్ల స్వగ్రామమైన లద్దగిరి సర్పంచ్ హనుమంతు పదవీ విరమణ కార్యక్రమం అంటూ ధర్మవరం సుబ్బారెడ్డి అదేరోజు లద్దగిరి గ్రామంలో కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ డోన్ ఎమ్మెల్యే తన రాజకీయ ప్రత్యర్థి కోట్ల చిన్నాన్న అయిన కోట్ల కోదండరామిరెడ్డి కుటుంబీకులను ధర్మవరం సుబ్బారెడ్డి కలవడంతో ఎమ్మెల్యే వర్గీయులకు పుండుమీద కారం చల్లినట్లయింది.
ఎగువ అహోబిల క్షేత్రంలో అగ్నిప్రమాదం
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రం ఎగువ అహోబిల క్షేత్రంలో కారధ్య నరసింహస్వామి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద భద్రత సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక షెల్టర్ షార్ట్ సర్క్యూట్‌తో కాలిపోయింది. ఆదివారం గేటు వద్ద ఉన్న షెల్టర్‌ను ఒక్కసారిగా పొగలు, మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారంతా భయాందోళనకు గురయ్యారు. సీసీ కెమెరాలతో పాటు నిఘా వ్యవస్థ పూర్తిగా కాలి బూడిదైంది. ఈఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.


