సున్నిపెంటలో కూటమి నేతల సర్వే చట్ట విరుద్ధం | - | Sakshi
Sakshi News home page

సున్నిపెంటలో కూటమి నేతల సర్వే చట్ట విరుద్ధం

Apr 20 2026 9:41 AM | Updated on Apr 20 2026 9:41 AM

ఎమ్మెల్యే బుడ్డాపై కేసు నమోదు చేయాలి

శ్రీశైలంప్రాజెక్ట్‌: సున్నిపెంట గ్రామంలో ప్రైవేటు సర్వే చేసేందుకు కూటమి నాయకులకు ఎవరు హక్కు ఇచ్చారని, ప్రైవేటుగా సర్వే చేస్తుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు.. జిల్లా కలెక్టర్‌ అధికార యంత్రాంగంతో సున్నిపెంటలో ప్రతి గడప సర్వే చేపట్టారని, ఇందుకు ప్రజలు కూడా సహకరించారన్నారు. అయితే జిల్లా కలెక్టర్‌ అనుమతి లేకుండా ఎమ్మెల్యే బుడ్డా, ఆయన అనుచరుడు యుగంధర్‌రెడ్డి మళ్లీ ప్రైవేటుగా సర్వే జరిపించడం చట్టరీత్యా నేరమన్నారు. ప్రజల వ్యక్తిగత వివరాలను వారి ఆధార్‌కార్డులు, ఇతర పత్రాల ద్వారా సేకరించి డాటా చోరీకి పాల్పడుతున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, యుగంధర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సున్నిపెంటలోని కొందరి వ్యక్తుల గృహాలు, స్థలాలను లాక్కోవడానికి టీడీపీ నేతలు పెద్ద కుట్ర పన్నుతున్నారని శిల్పా విమర్శించారు. సున్నిపెంటలో ఏ ఒక్కరూ భయపడవద్దనీ, ప్రజలందరికీ తాను అండగా ఉంటానన్నారు. తాము అధికారంలో ఉన్న ప్పుడు జీవో నంబర్‌ 40 ద్వారా సున్నిపెంటను గ్రామ పంచాయతీగా చేసి, సచివాలయ వ్యవస్థ తీసువచ్చామన్నారు. స్థానికులకు ఇంటి యాజమాన్య హక్కులు కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు పేదల ఆస్తులను లాక్కునేందుకు యత్నించడం దారుణమన్నారు. సున్నిపెంట ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడుతానన్నా రు. అవసరమైతే సొంత ఖర్చులతో సుప్రీం కోర్టు వరకు ప్రజల ఆస్తులను కాపాడుతానని శిల్పా చక్రపాణిరెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement