నంద్యాల(న్యూటౌన్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై ఇతర కార్మిక సంఘాలతో కలిసి పోరాటాలు చేస్తా మని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు పేర్కొన్నారు. ఆదివారం సీఐటీయూ రాష్ట్ర మహాసభల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మూడు రోజులుగా నంద్యాల పట్టణంలో రాష్ట్ర మహాసభలు దిగ్విజయంగా నిర్వహించామన్నారు. 80 మంది చర్చల్లో పాల్గొన్నారన్నారు. రాబోయే మూడు సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం స్థితి గతులను మెరుగు పడేందుకు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. మోదీ ప్రభుత్వం లేబర్ కోడ్‌లతో 12 గంటల పనివిధానాన్ని తెచ్చిందని, దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నట్లు చెప్పారు. కార్మిక చట్టాల అమలు కోసం హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం కార్మికులు సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్ర మహాసభల్లో 25 తీర్మానాలు ఆమోదం చేసినట్లు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి పేర్కొన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని, స్కీం వర్కర్ల సమస్యలపై ఐక్యపోరాటాలు, మహిళలకు మూడు రోజులు నెలసరి సెలవులు ఇవ్వాలని, వర్కర్లకు రక్షణ భద్రత కల్పించాలన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏసురత్నం, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.


