రెండేళ్లుగా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి? కమీషన్ల ఇచ్చేవారికే పనులు ఇవ్వలేదా? గ్రామ పంచాయతీ నిధులను టీడీపీ నాయకులు స్వాహా చేయలేదా? విలేకరుల సమావేశంలో
బనగానపల్లె: డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదెవరో, ఉనికి కోసం రాజకీయం చేస్తున్నది ఎవరో ప్రజలకు తెలుసని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి గురించి బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. రెండేళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి లేకుండా అక్రమాలు తారాస్థాయికి చేరడంతో ప్రజలు ఛీత్కరించుకుంటున్నారన్నారు. కమీషన్లు ఇచ్చేవారికే పనులు ఇస్తూ, గ్రామ పంచాయతీ నిధులు స్వాహా చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను చూపారు. బనగానపల్లెలో శనివారం సాయంత్రం విలేకరులతో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడారు.. ఆయన మాటల్లోనే..
ఓపెన్ డిబేట్‌కు సిద్ధం
‘‘ నేను 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా ఉన్నా. ఈ సమయంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో శాశ్వత మంచినీటి పథకాలు, రోడ్లు నిర్మాణం, ఇంకా మరెన్నో అభివృద్ధి పనులు చేశాం. బనగానపల్లెలో వందపడకల ఆసుపత్రి, జీఎం టాకీసు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు సెంటర్ లైటింగ్ సౌకర్యం కల్పిలించాం. కోవెలకుంట్ల, కొలిమిగుండ్లలో ఇదే విధమైన సౌకర్యం కల్పించాం. అన్ని మండల కేంద్రాల్లో రోగులకు వైద్య సౌకర్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించాం. మంత్రిగా రెండేళ్లుగా మీరు ఏమి చేశారు? ఇద్దరి హయాంలో జరిగిన అభివృద్ధిపై ఓపెన్ డిబేట్‌కు మేం సిద్ధం.
పేద రైతుల తరఫున పోరాడుతాం
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని 2020 మార్చిలో భానుముక్కలలో 65.11 ఎకరాల ఎస్‌ఆర్‌బీసీ స్థలాన్ని సేకరించాం. అప్పట్లో కోర్టుకు వెళ్లి పేదలకు స్థలం పంపిణీ జరకుండా అడ్డుకున్నారు. ప్రజలకు ఒక చట్టం, మంత్రికి ఒక చట్టమా? ఎన్నికల సమయంలో ఎన్ని కోట్లు అయినా సరే సొంత డబ్బులతో భూమిని కోనుగోలు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు కదా.. ఆ హామీ ఏమైంది? అప్పట్లో మేం సేకరించిన భూమినే మీరు పేదలకు పంపిణీ చేసేందుకు సిద్ధం కావడం నిజం కాదా? వెంకటేశ్వరస్వామి ఆలయ మాన్యం భూమి కూడా ఇళ్ల స్థలాల పంపిణీకి సిద్ధమయ్యారు కదా! ఆలయ మాన్యం భూమి 85 ఎకరాలను ఇల్లూరుకొత్తపేట గ్రామంలో గతంలో పేదలకు పంపిణీ చేశారని, దాన్ని తీసుకుంటే పేద రైతుల తరఫున తప్పక పోరాడతాం.
బలవంతంగా డబ్బులు వసూళ్లు
కొలిమిగుండ్ల మండలం గోరుమానుపల్లి గ్రామ పంచాయతీకి చెందిన మొత్తాన్ని టీడీపీ నాయకుడు రామేశ్వరరెడ్డి స్వాహా చేశారు. ఈ విషయం ఇక్కడ అందరికీ తెలిసిందే. ఈ విషయంపై మంత్రి బీసీ ఎందుకు స్పందించడం లేదు. ఆల్ట్రాటెక్ రాంకో మహా సిమెంట్ ఫ్యాక్టరీల్లో మేం ఎంతో మందికి జీవనోపాధి చూపాం. ఇప్పుడు కమీషన్ల ఇచ్చేవారికే పనులు అప్పగిస్తున్నారు. బనగానపల్లె పట్టణంలో పలువురి నుంచి బలవంతంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. ఇలా వసూలు చేసి అభివృద్ధి కోసమని అబద్ధాలు చెబుతున్నారు’’ అని కాటసాని అన్నారు. ప్రజలు అన్నీ చూస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధిచెబుతారన్నారు.
సమాధానం చెప్పాలి
నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి స్వగ్రామం యనకండ్లలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేశాం. ఆ గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే దానిని మూసివేయించి దానిపై ఉన్న నా ఫొటోలకు రంగులు వేయించారు. బనగానపల్లె పాతబస్టాండ్ కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్‌ను నిర్మిస్తే ఓర్వలేక కూల్చి వేశారు. రోడ్డు వెడల్పులో భాగంగా పాతబస్టా ండ్‌లో పేద ప్రజలు జీవనోపాధి పొందుతున్న షాపులను తొలగించారు. ఇదే కారణంతో మైనర్ ఇరిగేషన్ కార్యాలయాన్ని తొలగించారు. మంత్రి ఇల్లు కూడా రోడ్డుకు అడ్డంగా ఉంది ఎందుకు తొలగించలేదో సమాధానం చెప్పాలి. మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలో వస్తే అదే స్థానంలో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తాం.
మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి


