డోన్: గత కొద్దిరోజులుగా వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న నంద్యాల జిల్లా డోన్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌గౌడ్ తీరు పట్టణంలో చర్చనీయాంశమైంది. ఇటీవల ప్రసాద్‌గౌడ్ వ్యవహార శైలిపై సామాజిక మాద్యమాల్లో పోస్టులు హల్‌చల్ చేస్తున్నాయి. మున్సిపల్ పరిధిలో మొత్తం 32 వార్డులు ఉండగా, ఇటీవల జరిగిన చివరి సమావేశం ఎజెండాలో 45వ వార్డులో తాను నివసిస్తున్నట్లు పేర్కొంటూ తన కూతురు సాయి కీర్తనకు మున్సిపల్ కార్యాలయంలో నాన్ పీహెచ్ వర్కర్‌గా ఉద్యోగం కోసం ఎమ్మెల్యే సిఫారసు చేశారని అజెండాలో చేర్చారు. ఇదే అజెండాలో సాయి కీర్తన అనే అమ్మాయి మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌గౌడ్‌ను ఉద్యోగం కోసం అభ్యర్థించిందని మరోచోట పేర్కొనడం విశేషం.
● మున్సిపల్ పరిధిలో పన్నుల పర్యవేక్షణకు ప్రతి నెలా రూ.35 వేలు ప్రైవేటు వాహనం అద్దె కింద తీ సుకుంటూ ప్రైవేటు డ్రైవర్‌ను కాదని, రూ.50 వే లు వేతనం తీసుకుంటున్న మున్సిపల్ వాహన డ్రైవర్ ను తన కారు డ్రైవర్‌గా నియమించుకున్నారు.
● ఆగస్టు 15, జనవరి 26 లాంటి జాతీయ పర్వదినాల సందర్భాలతో పాటు వివిధ నాయకుల జయంతులు, వర్దంతులు జరిపే సమయంలో కూడా ఆయన డ్యాన్సుల పేరిట చిందులు తొక్కు తూ విమర్శలకు గురవుతున్నారు. పట్టణంలోని కోతులు, పందులను పట్టి ఇతర ప్రాంతాలకు తరలించడంతో పాటు కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించానంటూ పెద్ద మొత్తంలో నిధులు స్వాహా చేసినటు ఆరోపణలు ఉన్నాయి.
● ఇటీవల మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి పాదాభివందనం చేసి మరోసారి వార్తల్లోకెక్కారు. ఇదే ప్రసాద్‌గౌడ్ మూడేళ్ల క్రితం కర్నూలు జిల్లా గూడూరు కమిషనర్‌గా పనిచేస్తూ అక్కడి ఎమ్మెల్యే సుధాకర్‌ను మంత్రిగా చేసే వరకు విశ్రమించ రాదని పలు బహిరంగ వేదికల్లో మాట్లాడిన విషయాన్ని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. ప్రస్తు తం డోన్ కమిషనర్‌గా కాకుండా ఫక్తు టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్న ప్రసాద్‌గౌడ్ వైఖరి స్థానికులకు మింగుడు పడటం లేదు.
● స్థానిక పేరంటాలమ్మ గుడి వద్ద మున్సిపల్ స్థలంలో అక్రమంగా నిర్మించారంటూ ఆంజనేయస్వామి గుడిని ప్రొక్లెయిన్లతో కూల్చివేశారు. ఇదే కమిషనర్ ఎమ్మెల్యే కోట్లను తప్పుదారి పట్టించి స్థానిక బోగందాని వంక బఫర్ జోన్ స్థలంలో మరో హనుమాన్ దేవాలయ నిర్మాణానికి పునాదిరాయి వేయించారు. ఇక్కడ గుడి నిర్మించే పేరుతో కొందరు టీడీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే పన్నాగం పన్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కమిషనర్ ప్రసాద్‌గౌడ్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో కూడా నేర్పరని కొందరు విమర్శిస్తున్నారు. కమిషనర్ వ్యవహార తీరుపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తరచూ వివాదాస్పదంగా
డోన్ కమిషనర్
అడ్డగోలు నిర్ణయాలతో
ప్రజాధనం వృథా
అడ్డదారిలో కూతురికి
ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం


