రేపు హైకోర్టు జడ్జీలు రాక | - | Sakshi
Sakshi News home page

రేపు హైకోర్టు జడ్జీలు రాక

Apr 18 2026 7:53 AM | Updated on Apr 18 2026 7:53 AM

నంద్యాల(వ్యవసాయం): నంద్యాల కోర్టు కాంప్లెక్స్‌లో 9వ అదనపు జిల్లా కోర్టుతో పాటు మూడు అదనపు కోర్టుల ప్రారంభోత్సవానికి ఆదివారం నంద్యాలకు హైకోర్టు జడ్జీలు వస్తున్నట్లు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జీవీఎన్‌ ప్రసాద్‌, ఉపాధ్యక్షుడు ప్రతాపరెడ్డి, కార్యదర్శి కందాల గౌరీశంకర్‌ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కర్నూలు ఉమ్మడి జిల్లా ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి కబర్ది, నంద్యాల మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజ, కర్నూలు జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి హైకోర్టు జస్టిస్‌ కృష్ణమోహన్‌, జస్టిస్‌ కోనకంటి శ్రీనివాసరెడ్డి, జస్టిస్‌ హరిహరనాథశర్మ, కలెక్టర్‌, ఎస్పీ, అధికారులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు వారు తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.

ఐఏఎస్‌ లక్ష్యంగా చదువుతా

సంజామల: ఆర్‌.లింగందిన్నె గ్రామానికి చెందిన మూరబోయిన గౌతమి ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో సత్తా చాటింది. గ్రామానికి చెందిన మూరబోయిన లింగన్న, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె గౌతమి ఇటీవల విడుదలైన ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో మెదటి సంవత్సరం బైపీసీ గ్రూప్‌లో 453 మార్కులు సాధించి అందరి నుంచి అభినందనలు అందుకుంటోంది. గౌతమి ఆరో తరగతి నుంచి పది వరకు కోవెలకుంట్ల గురుకుల పాఠశాలలో చదువుకుంది. ఇంటర్మీడియెట్‌ కర్నూలు జిల్లా బనవాసి రెసిడెన్షియల్‌ కళాశాలలో చదువుతోంది. తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పేదరికం వెంటాడుతున్నా చదువులో గౌతమి రాణిస్తోంది. ఐఏఎస్‌ లక్ష్యంగా ప్రణాళికతో చదువుతూ ముందుకెళ్తానని గౌతమి చెబుతోంది.

జనగణనలో స్వీయ నమోదు విధానంపై అవగాహన

నంద్యాల: జనగణన–2027లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయ నమోదు విధానాన్ని ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ స్వయంగా అధికారిక వెబ్‌సైట్‌ https://se.census.gov.in ద్వారా తన కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆన్‌లైన్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ముందుగా పోర్టల్‌లో నమోదు చేసుకుని, మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరణ పూర్తి చేయాలన్నారు. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు, నివాస సమాచారం, విద్యా స్థాయి, ఉపాధి వంటి అంశాలను కచ్చితంగా నమోదు చేయాలన్నారు. ఒక కుటుంబానికి ఒక మొబైల్‌ నంబర్‌ మాత్రమే ఉపయోగించాలన్నారు. నమోదు పూర్తిచేసే ముందు ఆప్షన్‌ ద్వారా వివరాలను పరిశీలించి, అనంతరం చేయాలని తెలిపారు. ఇంటర్నెట్‌ సౌకర్యం లేని వారు లేదా స్వయంగా నమోదు చేయలేని వారికి ప్రభుత్వం నియమించిన ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారన్నారు. జిల్లాలోని ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకుని జనగణన ప్రక్రియలో భాగస్వాములు కావాలన్నారు.

పెండింగ్‌లో 2,255

వ్యవసాయ కనెక్షన్లు

నంద్యాల(అర్బన్‌): జిల్లాలో 2024 నుంచి ఇప్పటి వరకు 5,392 కొత్త వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చామని, ఇంకా 2,255 వ్యవసాయ కనెక్షన్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ సుధాకర్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల సంబంధించిన సీనియారిటీ జాబితాను అన్ని సచివాలయాల్లో ప్రదర్శించామన్నారు. ఈ జాబితాలో డిపాజిట్‌ చెల్లించి కనెక్షన్ల కోసం వేచి చూస్తున్న దరఖాస్తు దారుల వివరాలను సీనియారిటీ క్రమంలో పొందు పరించామని, దరఖాస్తు దారులు తమ దరఖాస్తు ప్రస్తుత స్థితిని సులభంగా తెలుసుకోవచ్చన్నారు. అదే విధంగా 2,464 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామని, 906 ట్రాన్స్‌ఫార్మర్లు అవసరంగా గుర్తించామన్నారు. రైతులు సచివాలయాల్లో ప్రదర్శించిన జాబితాను పరిశీలించి తమ వంతు వచ్చే వరకు సహకరించాలని జాబితాలో పేరు లేకపోయినా ఏవైనా పొరపాట్లు ఉన్నా వెంటనే సంబంధిత విద్యుత్‌ శాఖ అధికారులను కలిసి సరి చేసుకోవాలని సూచించారు. విద్యుత్‌ సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement