● జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్
బొమ్మలసత్రం: విధి నిర్వహణ, శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా గడిపే పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. పోలీసు వెల్ఫేర్ కార్యక్రమం ద్వారా సిబ్బంది సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ గ్రీవెన్స్‌డేను ఎస్పీ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 12 మంది సిబ్బంది తమ సమస్యలను విన్నవించగా, పరిష్కరిస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు.
మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దుతు
నంద్యాల: నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లుకు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శశికళారెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో రాష్ట్ర దృశ్యకళల మాజీ డైరెక్టర్ సునీత అమృత రాజ్, నంద్యాల అసెంబ్లీ అధ్యక్షురాలు హుసేనమ్మ, మాజీ కౌన్సిలర్ కన్నమ్మ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శశికళారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతంపైగా రిజర్వేషన్లను కల్పించారన్నారు. కేబినెట్ పదవులో మహిళలకు ప్రాధాన్యత కల్పించారని, డిప్యూటీ సీఎం, హోంశాఖ, వైద్యారోగ్యశాఖ, టూరిజం.. ఇలా అనేక కీలక శాఖలను మహిళలకు కేటాయించారన్నారు. సంక్షేమ పథకాలు కూడా మహిళలకే వర్థింపజేశారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు.
భవన నిర్మాణ కార్మికులకు నాలుగు పథకాలు
కర్నూలు(అర్బన్): భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు ప్రసూతి సహాయం, వివాహ కానుక, అంత్యక్రియల ఖర్చు, సహజ మరణ ఆర్థిక సహాయం పథకాలను పునరుద్ధరించినట్లు ఉప కార్మిక కమిషనర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. భవన నిర్మాణ గుర్తింపు కార్డు కలిగిన కార్మికుల కుటుంబ సభ్యులకు వివాహ కానుకగా రూ.20 వేలు, ప్రసూతి ప్రయోజనం కింద రూ.20 వేలు, సహజ మరణ ఉపశమనానికి రూ.60 వేలు, అంత్యక్రియల ఖర్చులకు రూ.20 వేలు లభిస్తుందని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా పథకాల కింద ప్రయోజనం పొందేందుకు తమ దరఖాస్తులను సమీప సహాయ కార్మిక అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 15న కార్మిక సంఘాల నాయకులతో అవగాహన సదస్సును నిర్వహిస్తామన్నారు. కార్మిక సంక్షేమ బోర్డులో లబ్ధిదారులుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.


