బనగానపల్లె: పట్టణ సమీపంలోని ఎస్సార్‌బీసీ కాలనీలో ఈద్గాను (ముస్లింల ప్రార్థనా మందిరం) రెండు రోజుల క్రితం అర్ధరాత్రి రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశాలతో ఆయన అనుచరులు జేసీబీలతో కూల్చేశారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, పలువురు ముస్లిం నాయకులు తెలిపారు. ఈద్గా కూల్చివేసిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు గురువారం ఉదయం కాటసాని రామిరెడ్డి బనగానపల్లెలోని తన ఇంటి నుంచి బయలుదేరగా, సీఐలు మంజునాథ్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐలు దుగ్గిరెడ్డి, కల్పన, పోలీసు సిబ్బందితో వచ్చి అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ముస్లింలు పెద్ద ఎత్తున కాటసాని ఇంటి వద్దకు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తాను ఈద్గా వద్దకు వెళితే పోలీసులకు ఇబ్బంది ఏమిటని కాటసాని రామిరెడ్డి ప్రశ్నిస్తూ తన ఇంటి వద్దే నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బనగానపల్లెలో కొన్నేళ్ల కిందట ఎస్సార్‌బీసీ ఎస్‌ఈగా పని చేసిన హుస్సేన్‌మియా తన సిబ్బందితోపాటు పట్టణ ముస్లిం సోదరుల సహకారంతో ఎస్‌ఆర్‌బీసీ కాలనీలో మసీదు, మదర్‌సా, ఈద్గాను నిర్మించారని తెలిపారు. ప్రస్తుతం ఇళ్ల స్థలాల కోసం మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఎస్సార్‌బీసీ కాలనీలోని నివాసయోగ్యమైన ఇళ్లు, ఈద్గాను అర్ధరాత్రి కూల్చివేయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎస్సార్‌బీసీ కాలనీలోని క్వార్టర్స్, మసీదు, ఈద్గా, మదరసా జోలికి వెళ్లకుండా నిరుపయోగంగా ఉన్న ఆరు ఎకరాల స్థలాన్ని కలెక్టర్‌తో మాట్లాడి పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు తీసుకున్నానని చెప్పారు. దానిపై అప్పట్లో బీసీ జనార్దన్‌రెడ్డి కోర్టులో కేసు వేసి స్టే తీసుకొచ్చారని గుర్తుచేశారు. తాను స్టేను తొలగింపచేసే సమయానికి ఎన్నికల కోడ్ వచ్చిందని, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ ఆగిపోయిందని కాటసాని రామిరెడ్డి వివరించారు. వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్‌ఖైర్ మాట్లాడుతూ ఈద్గా కూల్చివేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి,
ముస్లిం నాయకుల వెల్లడి
ఈద్గాను పరిశీలించేందుకు
బయలుదేరిన కాటసాని హౌస్ అరెస్ట్
బనగానపల్లెలో ఉద్రిక్తత


