బొమ్మలసత్రం: గుర్తుతెలియని కొత్త నెంబర్ల నుంచి మొబైల్ ఫోన్‌కు వచ్చే లింక్‌లను ఓపెన్ చేస్తే ప్రమాదంలో పడ్డట్టేనని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ హెచ్చరించారు. గురువారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో నగదు మోసాలకు పాల్పడుతున్నారని, అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మొబైల్ ఫోన్‌కు ఏపీకే ఫైల్స్ లింక్‌ను పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు. లింక్‌ను ఓపెన్ చేయగానే మొబైల్‌ఫోన్‌లో ఉన్న డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతుందన్నారు. ఆదమరిచి లింక్ ఓపెన్ చేస్తే వెంటనే పోలీసులు, 1930 నెంబర్‌కు ఫోన్‌చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు.
క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడి అరెస్ట్
కొలిమిగుండ్ల: ఐపీఎల్ టీ20 క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రమేష్‌బాబు తెలిపారు. నందిపాడుకు చెందిన గుర్రాల కంబగిరి రాముడు అలియాస్ శ్రీరామ్ అనే వ్యక్తి గురువారం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్‌పై బెట్టింగ్ నిర్వహించాడు. సమాచారం అందుకున్న శ్రీరామ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతని వద్ద నుంచి రూ.24 వేలు స్వాధీనం చేసుకున్నారు. వివిధ గ్రామాలకు చెందిన ఎనిమిది మంది వ్యక్తులు శ్రీరామ్ వద్ద బెట్టింగ్ ఆడినట్లు నిర్ధారించారు. ఈ మేరకు అందరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
బీసీ రిజర్వేషన్లపై వినతులకు ఆహ్వానం
కర్నూలు(అర్బన్): స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను పరిశీలించేందుకు ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్(చైర్మన్ రిటైర్డు ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా) ప్రజల నుంచి వినతులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కె.ప్రసూన తెలిపారు. బీసీల స్థితిగతులు, రిజర్వేషన్లపై అవగాహన ఉన్న వారు తమ వినతిపత్రాలను ఆధారాలతో సహా ఈ నెల 30లోగా చేరే విధంగా పోస్టు ద్వారా పంపాలని ఆమె గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినతి పత్రాలను డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలోని 1వ అంతస్థు, కొనేరు లక్ష్మయ్య వీధి, మొఘల్‌రాజాపురం, విజయవాడ – 520010 అనే చిరునామాకు పంపాల్సి ఉందన్నారు. లేదా ఈ మెయిల్ (apbcdedicatedcommisson 2026 @gmali.com) ద్వారా పంపవచ్చన్నారు.
సీబీఎస్‌ఈ ఫలితాల్లో ‘నవోదయం’
ఎమ్మిగనూరుసెంట్రల్: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) నిర్వహించిన 10వ తరగతి పరీక్షల్లో బనవాసి జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. 79 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందరూ ఉత్తీర్ణత సాధించారు. పాఠశాలకు చెందిన సాయిచరణ్ 485 మార్కులు, గణేష్ 477 మార్కులు, ప్రణీత్ 467 మార్కులు సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ ఈ.పద్మావతి గురువారం అభినందించారు. విద్యార్థులు భవిష్యత్‌లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు.


