అమ్మ కష్టాన్ని చూసి చదివా | - | Sakshi
Sakshi News home page

అమ్మ కష్టాన్ని చూసి చదివా

Apr 16 2026 10:00 AM | Updated on Apr 16 2026 10:00 AM

అమ్మ కష్టాన్ని చూసి చదివా

ఇంజినీర్‌ కావాలని ఉంది

మాది నిరుపేద కుటుంబం. నాన్న అన్నపురెడ్డి భాస్కర్‌ 16 ఏళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. రోజువారి కూలీపోతేగానీ ఇల్లు గడవని పరిస్థితి. మా అక్క అనారోగ్యంతో చనిపోగా, రెండో అక్క బీటెక్‌ చదువుతోంది. మా పేదరికాన్ని చూసి ఆర్డీటీ వారు ఆరో తరగతి నుంచే నా చదువు బాధ్యతలు తీసుకున్నారు. మా అమ్మ అన్నపురెడ్డి సుబ్బమ్మ కష్టాన్ని చూసి బాగా చదివాను. కర్నూలు నగరంలో ఓ కాలేజీలో ఎంపీసీ గ్రూప్‌లో చేరి 992 మార్కులు సాధించాను. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించి, కుటుంబానికి అండగా నిలుస్తాను.

– అన్నపురెడ్డి మరియమ్మ, నల్లకాల్వ, ఆత్మకూరు మండలం, నంద్యాల జిల్లా

నంద్యాల(న్యూటౌన్‌): ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్ష ఫలితాల్లో గతేడాదితో పోల్చితే ప్రథమ సంవత్సరం ఉత్తీర్ణత శాతం కొంత మెరుగుబడి, ద్వితీయ సంవత్సరంలో పెద్దగా మార్పులేదు. ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు బుధవారం విడుదల కాగా మొదటి సంవత్సరం 70.50 శాతం, రెండో సంవత్సరం 78.56 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో బాలుర కంటే బాలికలే అత్యధిక శాతం మంది పాస్‌ అయ్యారు. మొదటి సంవత్సరం విద్యార్థులు జనరల్‌ విభాగంలో 13,957 మంది విద్యార్థులు హాజరు కాగా 9 వేల మంది విద్యార్థులు (70 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌ విభాగంలో 1,343 విద్యార్థులకు గాను 688 మంది (61.75 శాతం) ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌ విద్యార్థులు జనరల్‌ విభాగంలో 12,657 మందికి గాను 9,297 మంది (78 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌ విభాగంలో 1,233 మందికి గాను 827 పాస్‌ (76 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బుధవారం ఇంటర్మీడియెట్‌ బోర్డు కమిషనర్‌ ఫలితాలను విడుదల చేశారు. జిల్లా మొదటి సంవత్సరం ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్రంలో 25వ స్థానం, ఇంటర్‌ రెండో సంవత్సరంలో రాష్ట్రంలో 19వ స్థానంలో నిలిచింది. ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారు. మొదటి ఏడాది పరీక్షల్లో 6,363 మందికి గాను 3,576 మంది బాలురు పాస్‌ అయ్యారు. అలాగే బాలికలు 7,694 మందికి గాను 5,424 మంది పాస్‌ అయ్యారు. అలాగే వొకేషనల్‌లో బాలురు 692 మందికి గాను 286 మంది పాస్‌ కాగా, బాలికలు 651 మంది గాను 402 మంది పాస్‌ అయ్యారు. అదే విధంగా ఇంటర్‌ రెండో సంవత్సరం ఫలితాల్లో బాలురు 5,679 మందికి గాను 3,815 మంది పాస్‌ కాగా, బాలికలు 6,978 మందికి గాను 5,482 మంది ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్‌ పరీక్షల్లో బాలురు 583 మందికి గాను 331 మంది పాస్‌ కాగా బాలికలు 650 మందికి గాను 496 మంది ఉత్తీర్ణత సాధించారు.

గోస్పాడు మోడల్‌ స్కూల్‌లో 99.16 శాతం

జిల్లాలో 19 ఏపీ మోడల్‌ స్కూళ్లు ఉన్నాయి. మొదటి సంవత్సర ఫలితాల్లో 1,489 మందికి గాను 1,092 మంది (74.89 శాతం), ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 1,359 మందికి గాను 1,104 మంది (83.57 శాతం) విద్యార్థులు ఉతీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో జిల్లాలో 100 శాతం ఫలితాలు రాలేదు. మొదటి సంవత్సరంలో గోస్పాడు మోడల్‌ స్కూల్‌ 99.16 శాతం సాధించగా, అతి తక్కువలో జూపాడుబంగ్లా మోడల్‌ స్కూల్‌ జూనియర్‌ కళాశాల 63 శాతం సాధించింది.

రెండు కేజీబీవీల్లో వంద శాతం..

జిల్లాలో 26 కేజీబీవీ జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. మొదటి సంవత్సరంలో 813 మంది విద్యార్థులకు గాను 573 మంది (70.48 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 653 మందికిగాను, 490 మంది (75.04శాతం) ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంలో గోస్పాడు, మిడుతూ రు కేజీబీవీలు 100 శాతం ఫలితాలు సాధించగా, ఆళ్లగడ్డ కేజీబీవీ అతి తక్కువ 31 శాతం సాధించి చివరలో నిలిచింది.

శ్రీశైలం కళాశాలలో 98 శాతం..

జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ఉన్నా యి. ఈ కాలేజీలకు చెందిన విద్యార్థులు మొదటి సంవత్సరంలో 2,599 మందికి గాను 1170 (45.72 శాతం), ద్వితీయ సంవత్సరంలో 2,203 మందికి గాను 1,498 (67.9 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం అత్యధికంగా శ్రీశైలం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 98 శాతం, అతి తక్కువ ఆళ్లగడ్డ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ 20 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.

రెసిడెన్షియల్‌ కాలేజీల్లో ఇలా..

జిల్లాలో ఆరు సోషల్‌ వెల్ఫేర్‌ కళాశాలలకు చెందిన విద్యార్థులు కాలేజీలకు చెందిన విద్యార్థులు ఫస్ట్‌ ఇయర్‌లో 441 మందికి గాను 410 మంది (93 శాతం) ఉత్తీర్ణులయ్యారు. సెకండ్‌ ఇయర్‌లో 390కి గాను, 377 మంది (97 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

● ఒకేషనల్‌ 9 ప్రభుత్వ కళాశాలల్లో 1,343 మందికి గాను 688 పాస్‌ కాగా (51 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అలాగే రెండో సంవత్సరం 1,233 మంది విద్యార్థులకు గాను 827 మంది పాసై (67శాతం) ఉత్తీర్ణులయ్యారు.

● జిల్లాలో మూడు బీసీ వెల్ఫేర్‌ కళాశాలలో మొదటి సంవత్సరం 243 మందికి గాను 230 మంది పాస్‌ కాగా 94.5 శాతం ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరం 238 మందికి గాను 222 మంది (94శాతం) ఉత్తీర్ణత సాధించారు.

● ఏపీ ట్రైబల్‌ వెల్ఫేర్‌ మూడు కళాశాలల్లో మొదటి సంవత్సరం 282 మందికి గాను 252 మంది (89 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అలాగే రెండో సంవత్సరం 295 మంది విద్యార్థులకు గాను 268 మంది (90 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

ప్రభుత్వ కళాశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన వారు..

మొదటి సంవత్సరం బైపీసీ విభాగంలో జీవమణి (438) ఆత్మకూరు, ఎంపీసీ విభాగంలో గురుపవిత్ర (458) ఆళ్లగడ్డ, సీఈసీలో ధనలక్ష్మి (489) ఉయ్యాలవాడ, రమేష్‌ (475) కొలిమిగుండ్ల, షేక్‌ జరీనాబేగ్‌ (487) నంద్యాల,

సెకండియర్‌ ఎంపీసీలో రమ్య (984) ప్యాపిలి, లక్ష్మీనరహరి (983) కోవెలకుంట్ల, షేక్‌ రియాజ్‌ (961), శీశైలం, సీఈసీలో అక్బర్‌బాబు 951(డోన్‌), ఉసేన్‌బీ (900) సంజామల, బైపీసీలో సీమ 974 (గోస్పాడు), స్వరూపరాణి (971) పాములపాడు.. తో పాటు పలువురు విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు.

ఇంటర్‌లో ఎంపీసీలో నాకు 984 మార్కులు వచ్చాయి. మా తల్లిదండ్రులు కూలీ పనులు చేసి కష్టపడి పడి నన్ను చదివించారు. కష్టపడి చదివించిన వారి రుణాన్ని ఇంజనీర్‌ను అయి తీర్చుకుంటా. వారి ఆశయ సాధనకు నిరంతరం శ్రమిస్తా. ఇంజనీర్‌ కావాలని ఉంది. – రమ్య, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్యాపిలి

రీకౌంటింగ్‌కు అవకాశం...

రీ వెరిఫికేషన్‌ దరఖాస్తులు ఈనెల 20 నుంచి 27 వరకు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 21 నుంచి జూన్‌ 4వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఐఈఓ శంకర్‌ నాయక్‌ తెలిపారు. పరీక్షల ఫీజు, చెల్లించాల్సిన తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

కోవెలకుంట్ల: మండలంలోని వెలగటూరుకు చెందిన ఓ ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన షాలిని నంద్యాల పట్టణంలో ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసింది. బుధవారం ఇంటర్‌ ఫలితాలు వెల్లడి కాగా పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో తీవ్ర మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రసాయన ద్రావణం(పేడపౌడర్‌) తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యానికి నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు.

ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే హవా

ఫస్టియర్‌లో 70.50 శాతం,

సెకండియర్‌లో

78.56 శాతం ఉత్తీర్ణత

సత్తాచాటిన ప్రభుత్వ

కళాశాల విద్యార్థులు

Advertisement
 
Advertisement
Advertisement