గోస్పాడు: కలకాలం కలసి ఉంటామని పెళ్లి నాడు చేసిన ప్రమాణాన్ని మృత్యువు సైతం వారిని విడదీయలేదు. వివాహ బంధంతో ఒక్కటైన ఆ జంట దాదాపు 60 ఏళ్లు కలతలు లేకుండా ఆనందంగా కొనసాగారు. కొన్నాళ్లు కుటుంబ బాధ్యతలతో తలమునకలైనా.. ఆ తర్వాత వృద్ధాప్యంలో కుమారుడి సపర్యలతో జీవితాన్ని గడుపుతుండగా మృత్యువు గంటల వ్యవధిలో వారిని తీసుకెళ్లింది. వారి వైవాహిక జీవితానికి తోడుగా ముగింపు పలకడం కుటుంబీకులు, గ్రామస్తులను కలిచివేసింది. ఈ విషాద ఘటన గోస్పాడు మండలం సాంబవరం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోరెడ్డి అంకాల్ రెడ్డి (88), వెంకటసుబ్బమ్మ (81)కు దాదాపు 60 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ముగ్గురు సంతానం. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈ దంపతులు పాడి పశువులతో పాటు పొలాలు సాగు చేసుకుంటూ జీవనం సాగించారు. మొదటి నుంచి భార్యాభర్తలు ఎలాంటి కలతలు లేకుండా ఎంతో అన్యోన్యంగా మెలుగుతూ ప్రశాంత జీవితాన్ని గడిపారు. వృద్ధాప్యంలో కూడా కుమారుడు వెంకటేశ్వరరెడ్డి వద్ద ఉంటూ కాలం వెల్లదీశారు. ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు కుమారుడు సపర్యలు చేస్తుండేవారు. అయితే వృద్ధాప్యం వల్ల ఇద్దరూ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భోజన అనంతరం నిద్రకు ఉపక్రమించారు. అయితే తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో వెంకటసుబ్బమ్మ ఆయాస పడుతుండడంతో కుమారుడు వెంకటేశ్వరరెడ్డి గమనించి పలుకరిస్తుండగా కొద్దిసేపటికి ఆమె మృతి చెందింది. భార్య ఇక లేదని తెలుసుకున్న అంకాల్‌రెడ్డి గుండె ఆగిపోయింది. తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో తండ్రి నుంచి ఎలాంటి చలనం లేకపోవడంతో మృతి చెందినట్లు కుమారుడు గుర్తించాడు. గంటల వ్యవధిలో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదించారు. దంపతులు ఇద్దరూ ఒకే రోజు మరణించడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
గంటల వ్యవధిలో
వృద్ధ దంపతుల మృతి
60 ఏళ్ల వైవాహిక జీవితం
తోడుగానే ముగింపు
సాంబవరం గ్రామంలో విషాదం


