● ఐదుగురిపై క్రమశిక్షణా చర్యలకు
ఆదేశాలు
మహానంది: మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురంలోని 24 గంటల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిపై తరచూ ఫిర్యాదుల నేపథ్యంలో బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 10.10 గంటల వరకు ఇద్దరు వైద్యులతో పాటు ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్‌లు విధులు హాజరు కాలేదు. అయితే విధులకు హాజరు కాని ముగ్గురు సిబ్బంది తరఫున స్థానిక ఎంపీహెచ్‌ఈఓ హుసేన్‌రెడ్డి ద్వారా మూమెంట్ రిజిస్టర్‌లో సంతకాలు చేసినట్లుగా ఉండటంతో కలెక్టర్ గుర్తించి తీవ్రంగా పరిగణించారు. ఐదుగురు వైద్య సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆసుపత్రిలో తనిఖీలు ముగించి పక్క గ్రామమైన అబ్బీపురం సచివాలయం వద్దకు చేరుకోగా అక్కడికి వైద్యాధికారులు భగవాన్‌దాస్, వేణుకార్తికేయలు చేరుకోగా ఇదేనా ‘మీ సమయ పాలన’ అంటూ మండిపడ్డారు.


