కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో బుధవారం ఆరుగురు విద్యార్థులు డిబార్ అయినట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. నాల్గో సెమిస్టర్ పరీక్షలకు 8281 మందికి 7470 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఎస్‌వీ ఆర్ట్స్ కళాశాల కేంద్రంలో ఇద్దరు, నంద్యాల నేషనల్ డిగ్రీ కళాశాల, ఎమ్మిగనూర్ రావూస్ డిగ్రీ కళాశాల, ఎస్‌ఎమ్‌ఎల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆలూరు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల పరీక్షల్లో కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఆరుగురు విద్యార్థులు చూచిరాతలకు పాల్పడగా డిబార్ చేసినట్లు తెలిపారు. బీఈడీ 4వ సెమిస్టర్ పరీక్షలకు 3575 మందికి 3381 మంది విద్యార్థులు హాజరు కాగా 194 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
వంకలోకి దూసుకెళ్లిన లారీ
పత్తికొండ రూరల్ : మండల పరిధిలోని అటికెలగుండు గ్రామ సమీపంలోని మలుపులో ఉన్న బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న ఓ లారీ మంగళవారం రాత్రి అదుపు తప్పి వంకలోకి దూసుకెళ్లింది. బనగానపల్లె నుంచి ఆదోనిలోని రైస్‌మిల్లుకు వడ్ల లోడుతో లారీ బయల్దేరింది. దేవనబండ–ఆటికెలగుండు మలుపు దగ్గర అదుపు తప్పి వంకలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బుధవారం హమాలీలతో వడ్లను వేరే లారీలోకి మార్చారు.
సుళువాయిలో
గడ్డివాములు దగ్ధం
హొళగుంద: సుళువాయి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఆరు గడ్డివాములు కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ. మూడు లక్షల వరకు ఆస్తి నష్ఠం సంభవించింది. గ్రామానికి చెందిన హరిజన పెద్ద ఈరన్న, వెండికట్ట వసంతకుమార్, బసాపురం రమేశ్, చాకలి పరుశురాం అనే రైతులు వరిగడ్డిని కొని ఎస్సీ కాలనీ సమీపంలో నిల్వ చేసుకున్నారు. అయితే మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఉన్నట్టుండి గడ్డివాములకు మంటలు అంటుకుని కాలిపోయాయి. స్థానికులు ఆలూరు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించగా వారు వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా అప్పటికే కాలి బూడిదయ్యాయి.
కర్నూలు(సెంట్రల్): వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీంను 2026–27 ఆర్థిక సంవత్సరానికి కొనసాగిస్తూ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జీఓ విడుదల చేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ డెప్యూటీ డైరక్టర్ జయమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్రిడిటేషన్ కలిగిన జర్నలస్టులు రూ.1250 ప్రీమియం చెల్లించి పథకాన్ని రెన్యూవల్ చేసుకోవాలన్నారు. www.cfmr.ap.gov.in అనే సైట్‌లో లాగిన్ అయి హెడ్ అకౌంట్ 8342–00–120–01–03–001, డీడీఓ కోడు 2703 0802 003 నందు ప్రీమియం చెల్లించేలాని సూచించారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్‌లోని ఐ అండ్ పీఆర్ కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
ప్యాపిలి: పట్టణంలోని స్థానిక శ్రీరామ టాకీస్ సమీపంలో నివాసం ఉంటున్న రామాంజనేయులు (29) అలియాస్ బిట్టు రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలు గు చూసింది. రామాంజనేయులు కొద్ది సంవత్సరాల క్రితం గుడిపాడుకు చెందిన మహేశ్వరిని వివాహం చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. రెండో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన మహేశ్వరి రెండు నెలల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది. మద్యం సేవించే అలవాటు ఉన్న రామాంజనేయులు భార్య పుట్టింటికి వెళ్లినప్పటి నుంచి మద్యానికి బానిసగా మారాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తన రెండు చేతులను కోసుకుని అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్తకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన భార్య తన బంధువులకు విషయం చెప్పింది. బుధవారం వారు ఇంటి వద్దకు వచ్చి చూడగా లోపల గడియ పెట్టినట్లు గుర్తించి వెంటనే తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూశారు. రామాంజనేయులు మృతి చెంది ఉండటంతో బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


