● విజయవంతంగా తొలగించిన వైద్యులు
కర్నూలు(హాస్పిటల్): ఓ రోగి కడుపులో ఏర్పడ్డ అతి పెద్ద క్యాన్సర్ కణితిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జనరల్ సర్జరీ విభాగం వైద్యులు విజయవంతంగా తొలగించారు. బుధవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనరల్ సర్జరీ హెచ్‌ఓడీ డాక్టర్ హరిచరణ్ వివరాలు తెలిపారు. కర్నూలు నగరంలోని ఎర్రబురుజు ప్రాంతానికి చెందిన జి.మత్తయ్య(75)కు చాలా ఏళ్లుగా కడుపులో గడ్డ(కణితి) ఉంది. ఈ నెల 6న ఆయన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో శస్త్రచికిత్స కోసం చేరాడు. జనరల్ సర్జరీ మొదటి యూనిట్ వైద్యులు అన్ని పరీక్షలు చేసిన తర్వాత అతనికి రెట్రోపెరిటోనియల్ లైపోసోర్కోమా అనే ఒక క్యాన్సర్ గడ్డ ఉన్నట్లు నిర్ధారించారు. ఇది కడుపులో ముప్పావు భాగాన్ని ఆక్రమించేంత పెద్దగా ఉంది. ఈ అతి పెద్ద కణితి అతని ఎడమ మూత్రపిండాన్ని పక్కకు జరిపింది. అన్ని పరీక్షలు అయిన తర్వాత ఈ నెల 15న ఆయనకు మూడు గంటల పాటు శ్రమించి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్ ప్రక్రియలో డాక్టర్ హరచరణ్‌తో పాటు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయబాబు, క్యాన్సర్ ఆసుపత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ మహేష్, డాక్టర్ అజమ్ముల్ హుసేన్, పీజీలు ఉన్నారు. అనెస్తీషియా ప్రొఫెసర్ డాక్టర్ రామశివనాయక్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణలత, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భార్గవ్‌రామ్ సహకరించారు. ఇంత పెద్ద పరిమాణంలో ఉన్న క్యాన్సర్ కణితిని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ ఎన్‌టిఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) కింద ఉచితంగా నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు.


