● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార
ప్రతినిధి బీవై రామయ్య
కర్నూలు (టౌన్): పోలీసులు నోటీసులు ఇవ్వకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శ్రీహరిని అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్ బీవై రామయ్య అన్నారు. బుధవారం ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీహరి ఒక జర్నలిస్టుగా పనిచేశారన్నారు. మీడియా ఇన్‌చార్జ్‌గా పనిచేసిన వ్యక్తిని ఎందుకు అరెస్టు చేస్తున్నారో కూడా తెలియకుండా పోలీసులు వ్యవహరించడం దారుణమన్నారు. ‘అసలు నోటీసులు ఇచ్చారా.. భయభ్రాంతులు చేయడం కోసమే కదా.. ఆటవిక పాలనలో ఉన్నామా..? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా?’ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత జయంతి రోజున అంబేడ్కర్‌కు దండలు వేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు అర్హుడా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభు త్వం భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయడం లేదని, రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ప్రశ్నించిన వారిని ఇబ్బందులు పెడుతోందన్నారు. శ్రీహరి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే అతన్ని బేషరుతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నారు. అవకాశం ఉంది కదా అని చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ప్రజలు గమనిస్తున్నారని, భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.


