నంద్యాల(న్యూటౌన్): పాలిటెక్నిక్ ఉత్తీర్ణులైన వారికి ఉపాధి అవకాశం అధికంగా ఉంటుంది. బీటెక్ పూర్తి చేసివారి కంటే ఉద్యోగాల ఎంపికలో ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ సెక్టార్‌లోనూ పాలిటెక్నిక్ వారికే పెద్దపీట వేస్తున్నారు. తక్కువ సమయం, ఖర్చుతో ఉద్యోగ, ఉపాధిని సులువుగా పొందే వెసులుబాటు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల ద్వారా ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే పాలిసెట్ రాసేందుకు పదోతరగతి విద్యార్థులు సైతం పోటీ పడవచ్చని తెలియజేస్తున్నారు. ఇంటర్ ఒకేషనల్ విద్యార్హతతో నేరుగా పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం పొందవచ్చని చెబుతున్నారు. అలాగే ఐటీఐ విద్యార్థులు బ్రిడ్జి పరీక్ష ద్వారా డిప్లొమా కోర్సుల్లో ద్వితీయ ఏడాదికి అడ్మిషన్ అందుకోవచ్చని వివరిస్తున్నారు. ఇంతటి సువర్ణావకాశాలు గల ఈ కోర్సులపై జిల్లాలోని పాలిటెక్నిక్ సిబ్బంది సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. పిల్లల ఉజ్వల భవితకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
కళాశాలల వివరాలు...
జిల్లాలో మొత్తం ఐదు పాలిటెక్నిక్ కళాశాలు ఉన్నాయి. అందులో ప్రభుత్వ కాలేజీలు 3, ప్రైవేటు 2 కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్ ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (నంద్యాల), ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (శ్రీశైలం), ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (బేతంచెర్ల),
ప్రైవేటు కళాశాలలు: ఎస్‌వీఆర్ ఇంజనీరింగ్(నంద్యాల), వాసవీ పాలిటెక్నిక్(బనగానపల్లె) ఉన్నాయి.
బ్రాంచ్‌లు, సీట్ల వివరాలు...
ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో సివిల్, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, సీఎంఈ, బీఎం, సీహెచ్‌ఎస్‌టీ, సీసీపీ, డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు. అయితే డిప్లొమా ఇన్ బయోమెడికల్ ఇంజినీరింగ్ మాత్రం మూడున్నరేళ్ల కోర్సు.
ప్రారంభమైన ఉచిత శిక్షణ...
జిల్లాలోని మూడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో పాలిసెట్‌కు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఉచిత శిక్షణతో పాటు మెటీరియల్‌ను అందించనున్నారు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శిక్షణ ఉంటుంది.
ప్రవేశం ఇలా..
ఇంటర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్హతతో ఎటువంటి ప్రవేశ పరీక్ష లేకుండా పాలిటెక్నిక్‌లో చేరొచ్చు. అలాగే ఇంటర్ ఒకేషనల్ చేసిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరై ద్వితీయ ఏడాది పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశం పొందవచ్చు. అలాగే ఐటీఐ ట్రేడ్లలో 60 శాతానికి పైగా మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు బ్రిడ్జి కోర్సు ద్వారా నిర్వ హించే అర్హత పరీక్షకు హాజరవ్వాలి. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ద్వితీయ ఏడాది పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో అడ్మిషన్ పొందవచ్చు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు, ఇదివరకే పదో తరగతి పూర్తి చేసిన వారు పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకో వచ్చు. ప్రవేశం నాటికి పదో తరగతి సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.
డిప్లొమా కోర్సులతో చక్కటి ఉపాధి లభిస్తుంది. జీవితంలో త్వరగా స్థిరపడడానికి పాలిటెక్ని క్ సరైన మార్గం. విద్యార్థులకు ఇదో మంచి అవకాశం, డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం, ఉపాధి పొందవచ్చు. పై చదువులకు సైతం ఉపయోగపడుతుంది. విద్యార్థులకు బుధవారం నుంచి ఉచితంగా శిక్షణ సైతం అందిస్తున్నాం. – శైలేంద్రకుమార్,
పాలిసెట్ కన్వీనర్, నంద్యాల
ఉచిత శిక్షణ
పొందుతున్న విద్యార్థులు
పదో తరగతి విద్యార్థులకు అవకాశం
ఇంటర్ ఒకేషనల్ విద్యార్హతతో
ద్వితీయ ఏడాదిలో నేరుగా ప్రవేశం
బ్రిడ్జి పరీక్ష ద్వారా ఐటీఐ విద్యార్థులకు
సెకండియర్‌లో అడ్మిషన్
25న ప్రవేశ పరీక్ష
డిప్లొమో కోర్సులతో చక్కటి ఉపాధి


