● దోచుకో.. దాచుకో అన్న ధ్యాస తప్ప,
అభివృద్ధి లేదు
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
ఆలూరు రూరల్: తీవ్రమైన ఎండలతో మంచినీరు దొరకక, గొంతులు ఎండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, గుక్కెడు నీరు ఇవ్వలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. ఆలూరులోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్ , పవన్‌కు ‘దోచుకో.. దాచుకో’ అన్న ధ్యాస తప్ప, అభివృద్ధి చేయడం తెలియదన్నారు. ఆలూరులో 20 రోజులకు ఒక సారైనా తాగునీరు రావడం లేదన్నారు. ఆస్పరి, చిప్పగిరి, ఆలూరు మండలంలోని మొలగవల్లి, కురుకుంద, హులేబీడు, పెద్దహోతూరు, తుంబళబీడు గ్రామా ల్లో నెల తరబడి మంచినీరు సరఫరా లేకపోవడంతో ప్రజలు పంచాయతీ కార్యాలయాలకు తాళం వేశారన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ వచ్చి ఏదైనా చేస్తామని చెప్పి వెవెళ్లారన్నారు. గత పదేళ్లుగా కురుకుంద గ్రామస్తులు ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లతో పక్కనే ఉన్న హెబ్బటం గ్రామానికి వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నారన్నారు.
ప్రభుత్వంలో కనీసం చలనం లేదు
తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే తాగునీటి పైపు లైన్లు మార్చాలని గత జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కు ఎస్టిమేట్ వేసి వినతిపత్రం ఇచ్చారన్నారు. డీఆర్సీ మీటింగ్‌లో కూడా చాలా సార్లు తాగునీటి సమస్యపై ప్రస్తావించినా చంద్రబాబు ప్రభుత్వానికి కనీసం చలనం లేదన్నారు.
ప్రచార ఆర్భాటాలకే పరిమితం
గ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇంచార్జ్ సోషల్ మీడియాలో ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని ఎమ్మెల్యే విరూపాక్షి విమర్శించారు. గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టి తిరగడం కాదని, తాగునీరు, రోడ్లు సమస్య తీర్చాలన్నారు. గ్రామాల అభివృద్ధికి సహకరించాలన్నారు. ఇన్‌చార్జ్ పదవి పోతే వారు ఇక్కడ ఉండబోరన్నారు. మంచినీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నా.. పక్కనే ఎల్‌ఎల్‌సీ పారుతున్నా.. ఎస్‌ఎస్ ట్యాంకులు సామర్థ్యం పెంచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆస్పరి మండలంలోని జొహరాపురం వద్ద ఎస్‌ఎస్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని అప్పటి కలెక్టర్ సృజన ద్వారా ప్రతిపాదనలు పంపిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దాన్ని విస్మరించిందన్నారు. నగరడోణ రిజర్వార్‌కు బిల్లు చెల్లిస్తే రెండు మండలాలు సస్యశామలం అవుతాయన్నారు.


