ఆళ్లగడ్డ: చైత్ర కృష్ణఏకాదశి నుంచి మూడు రోజులపాటు శ్రీ అహోబిల లక్ష్మీనరసింహ స్వామి వసంతోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా రెండో రోజైన మంగళవారం ఉదయం దిగువ అహోబిలంలో ప్రత్యేక పూజలు చేశారు. వసంత మంటపంలో ఉభయ దేవేరులతో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదులకు నవకళలశాలతో, పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం 108 కలశాలతో తిరుమంజనం సేవ నిర్వహించారు. ఉత్సవమూర్తులను పట్లుపీతాంబరాలతో ప్రత్యేకంగా అలంకరించి కొలువుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
26 నుంచి ‘శాప్’ ఎంపిక పోటీలు
నంద్యాల(న్యూటౌన్): ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో 2026–27 ఏడాదికి ఏప్రిల్ 26 నుంచి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 15 నుంచి 19 సంవత్సరాల్లోపు ఉన్న క్రీడాకారులు, 01–01–2008 నుంచి 01–01–2011 మధ్య జన్మించిన వారు అర్హులని తెలిపారు. ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. వివిధ క్రీడా విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులకు కోచింగ్, వసతి, భోజనం, ఆధునిక శిక్షణ సదుపాయాలు ఉంటాయని పేర్కొన్నారు. వివరాలు https://soprts.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలను నేడు(బుధవారం) విడుదల చేయనున్నారు. పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి గత నెల 24వ తేది వరకు నిర్వహించారు. జిల్లాలో మొదటి సంవత్సరం విద్యార్థులు 26,473 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 22,491 మంది హాజరయ్యారు. గత నెల 2వ తేది నుంచే కర్నూలు నగరంలోని టౌన్ మోడల్ జూనియర్ కాలేజీలో స్పాట్ క్యాంపును ఏర్పాటు చేశారు. ప్రధాన సబ్జెక్టుల మూల్యాంకనం గత 21వ తేదిన మొదలై.. ఈ నెల 9వ తేది వరకు కొనసాగింది. జిల్లాకు ఫస్ట్ ఇయర్, ద్వితీయ సంవత్సరానికి చెందిన సమధాన పత్రాలు మొత్తం 2,41,217 వచ్చాయి. పరీక్షల ఫలితాలు ఉదయం 10.31 గంటలకు విడుదల చేయ నున్నారు. ఫలితాల కోసం https:// resultsbie.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. 95523 00009 అనే నెంబరుకు Hi అని పెడితే ఫలితాలు తెలుసుకునే వీలుంది.


